ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర: కళా వెంకటరావు

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (08:39 IST)
ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నడంతో పాటు ఉచిత విద్యుత్తు హామీని నీరుగార్చబోతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధాతధంగా..
 
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్షా 8 వేల కోట్లు అప్పుచేయడం జరిగింది. మరింత అప్పు చేయడం కోసం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను నీరుగారుస్తోంది. ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారు. సజావుగా సాగుతున్న ఉచిత పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికే.

నవరత్నాల్లో ఉన్న హామీలకు రోజుకో షరతు పెడుతున్నారు. ప్రభుత్వం అప్పులు చేయడానికి రైతులను అప్పులపాలు చేయబోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించబోతున్నారు. రైతులకు జగన్ చెల్లించడం మధ్యలో మానేస్తే రైతుల గతేంటి? రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం కూడా బూటకమే.

రైతుల కోసమే అయితే మీటర్లు ఎందుకు పెడుతున్నారు? ఇది రైతు ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతిస్తోంది. విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గం. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమే.

ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతులు ఎంత మంది ఉన్నారు, కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు, వాళ్లలో బ్యాంక్ అకౌంట్ ఎంతమందికి ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా?

విద్యుత్ కనెక్షన్ ఒకరి పేరు మీద, పొలం మరొకరి పేరు మీద ఉంటుంది. వారి పరిస్థితి ఏంటి? పాత అకౌంట్ లో డబ్బులు వేస్తే రైతుల పాత బకాయిల కింద బ్యాంకర్లు జమచేసుకుంటారు. అందుకే కొత్త ఖాతాలు ప్రారంభించాలని చెప్పడం రైతులను అవమానించడం కాదా. ఇలాంటి చర్యలతోనే రైతులు అప్పుల పాలవుతున్నారు.

ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం పెడతాం అనేది ఒక తుగ్గక్ నిర్ణయం. దేశంలో ఈ పథకం ఎక్కడా లేదు. రాష్ట్రంలోనే ఎవరి ప్రయోజనం కోసం ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాక అప్పుల్లో కూరుకుపోయారు.

జగన్ విధానాల వల్ల రైతులు మరింత దెబ్బతింటారు. జగన్ పెద్ద ఎత్తున అప్పులు చేయడం కోసం  రైతులకు ఇచ్చే రాయితీలు రద్దు చేసి వారిని మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఇది రైతుల పాలిట పిడుగుగా ఉంది. ప్రతి ఒక్కరు జగన్ తీసుకువస్తున్న నూతన విధానాన్ని నిరసించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు