హిందూ సమాజాన్ని చీల్చేందుకు కుట్ర.. : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

బుధవారం, 24 జూన్ 2020 (08:28 IST)
'సమాజంలో మంచికి  ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే చెడు వచ్చేసి మొత్తం విస్తరిస్తుంది. అది విస్తరించే అవకాశం లేకుండా ఉండాలంటే మంచి పనులకు ప్రాధాన్యం కల్పించాలి. అసత్యాలు అతి త్వరగా, తరంగాల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి సత్యాన్ని అంతకు మించిన వేగంతో ప్రసరింపజేసితేనే న్యాయం నిలుస్తుంది.. ధర్మం గెలుస్తుంది' అని  సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ అన్నారు.

ధర్మ నిర్మాణం కోసం కంకణబద్ధులైన విశ్వహిందూ పరిషత్ కార్యాలయానికి రావడం.. ఆజన్మ బ్రహ్మచారులుగా హిందుత్వం కోసం పని చేస్తున్న ప్రచారకులను కలవడం  చాలా ఆనందం అనిపిస్తోందని  అభిప్రాయపడ్డారు. కోటిలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని లక్ష్మీనారాయణ సందర్శించారు.

ఈ సందర్భంగా సంఘం పెద్దలతో పలు విషయాలు చర్చించారు.  ధర్మానికి నిలయమైన విశ్వహిందూ పరిషత్  కేంద్రంగా హిందుత్వం ధైర్యంగా నిలబడుతోంది అన్నారు. వివిధ వర్గాలు, వైషమ్యాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చేందుకు విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టి హిందూసమాజాన్ని ఒక్కటి చేయాల్సిన బాధ్యత ప్రతి హైందవుడిపై ఉందన్నారు.
 
విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిందే....
"అనేక సంస్కృతి  సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. సకల కళలు విలసిల్లిన ఈ దేశం నేడు కళావిహీనం అయిపోయే పరిస్థితి  దాపురించింది. దీన్ని చక్క పెట్టాలంటే భారతీయ విద్యా వ్యవస్థ లో తప్పనిసరిగా మార్పు తీసుకు రావాల్సిందే" అని సిబిఐ మాజీ డైరెక్టర్ అన్నారు.

సంపద  ఎంత ఉన్నా  పిల్లలకు క్రమశిక్షణ నేర్పకపోతే వ్యర్థం అన్నారు. దేశ భక్తి లేని పట్టాలు పొట్ట నింపవచ్చు గాని.. మనసు నింపలేవన్నారు. నైతిక విద్యా విధానం ప్రవేశపెట్టి నీతి కథలు, రామాయణ, మహాభారతాలు పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. నేటి పిల్లలకు నీతి కథలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు.. అమ్మమ్మలు.. తాతయ్య పైనే ఉందని గుర్తు చేశారు.

నడవడిక, సద్గుణాల తోనే మనిషి  గొప్పతనం తెలుస్తుందన్నారు. అనంతరం లక్ష్మీనారాయణకి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి, అయోధ్య రామాలయం తో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.

హిందుత్వ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొనాలని, దైవ కార్యానికి సమయం కేటాయించాలని లక్ష్మీనారాయణకి సూచించారు. అంతకుముందు విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు మాట్లాడారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు