కరోనా వైరస్ : విశాఖలో ఐదుగురు.. విజయవాడలో ఒకరు...

గురువారం, 5 మార్చి 2020 (14:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తోరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇపుడు ఆంధ్రలోని విశాఖ నగరంలోనూ ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన నగర వాసులు ఐదుగురు వైరస్‌ లక్షణాలతో బుధవారం ఆసుపత్రిలో చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగరానికి చెందిన కుటుంబం కొద్దికాలం కిందట (భార్య, భర్త, కుమార్తె) కౌలాలంపూర్‌ వెళ్లింది. 
 
మంగళవారం రాత్రి ఇక్కడి విమానాశ్రయానికి చేరుకున్న వీరు ముగ్గురూ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన స్క్రీనింగ్ అధికారులు వెంటనే నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వార్డుకు తరలించారు. 
 
అలాగే, రెండు నెలలపాటు బహ్రెయిన్‌లో ఉండి గత నెల 28వ తేదీన నగరానికి వచ్చిన 23 ఏళ్ల యువతి, ఆమె స్నేహితుడు రెండు రోజుల నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో బుధవారం మధ్యాహ్నం కరోనా ప్రత్యేక వార్డులో చేరారు. వీరందరికీ వైద్యులు చికిత్స అందించడంతోపాటు వ్యాధి నిర్ధారణ కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. 
 
అదేవిధంగా విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుండటంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. అతని రక్త నమూనాలను కూడా సేకరించి పూణెలోని ప్రయోగశాలకు పంపించారు. వీరందరికి వైరస్ సోకిందో లేదో తెలియాలంటే రక్త పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు ఆగాల్సివుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు