ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది : తెదేపా అధినేత చంద్రబాబు

గురువారం, 4 జులై 2019 (13:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. తాను కాస్త జాగ్రత పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది గెలుపుపై అతి విశ్వాసం ప్రదర్శించారన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
కార్యకర్తలకు స్ఫూర్తి నింపడంలో ఫెయిలయ్యామన్నారు. అదేసమయంలో ప్రజలను మేనేజ్‌ చేయడంలోనూ విఫలమయ్యామన్నారు. తాను కూడా జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది నేతలు గెలుపుపై ఓవర్‌ కాన్ఫడెన్స్‌ ప్రదర్శించారని ఫలితంగానే దెబ్బతినాల్సి వచ్చిందన్నారు. 
 
అయితే రాష్ట్రంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైయిందని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయన్నారు. పించన్లు, విత్తనాలు, విద్యుత్‌ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
అంతకుముందు.. సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్‌షోను ఆయన నిర్వహించారు. అభిమానులు అడుగుడుగనా నీరాజనం పలికారు. కుప్పం పసుపు సంద్రంగా మారిపోయింది. పార్టీ అధికారంలో లేనంత మాత్రాన ఎవరూ అధైర్యపడొద్దన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. 
 
183 మంది టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు జరిగాయన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానన్నారు. ప్రాణం ఉన్నంతవరకు కుప్పం ప్రజలకు సేవ చేస్తానని చంద్రబాబు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు