ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. జ్యోతిషుడు అప్పన్న (50) గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. అతను అప్పన్నను పక్కా ప్లాన్ చేసి హతమార్చాడు. పూజ కోసం అని అప్పన్నను భార్యాభర్తలిద్దరూ తీసుకెళ్లి కత్తితో పొడిచి.. చనిపోయాక పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరం లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి, విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి.