కరోనాపై విజయానికి ప్రతి పౌరుడు పాటించాల్సిన సూత్రాలివే...

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:57 IST)
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని పదేపదే చెప్తున్నాయి. 
 
అదేసమయంలో ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడు సూత్రాలు వెల్లడించారు. ఈ సూత్రాలను ప్రతి పౌరుడూ పాటించి కరోనాపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఆ ఏడు సూత్రాలేంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఏడు సూత్రాలు ఆయన మాటల్లోనే..
 
* మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకొండి. ముఖ్యంగా అంతకుముందే ఏదైనా అరోగ్య సమస్య ఉన్న వాళ్ల విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. వాళ్లకి కరోనా సోకకుండా కాపాడుకోవాలి. 
 
* లాక్‌డౌన్, వ్యక్తిగత దూరంకి సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసిన మాస్కులను ఉపయోగించండి. 
 
* మీ రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ఆరోగ్యశాఖ (ఆయుష్) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించండి.
 
* కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరు 'అరోగ్య సేతు' యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్లని కూడా డౌన్‌లోడ్ చేసుకోమని సూచించండి.
 
* మీకు సాధ్యమైనంత వరకు.. పేదలకు సహాయం చేయండి. వాళ్ల ఆకలి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయండి. 
 
* మీకు పని చేస్తున్న చోట.. మీ తోటి ఉద్యోగుల పట్ల కరుణ, దయ చూపించండి. ఏ కంపెనీ కూడా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు. 
 
* దేశ వ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించండి.
 
ఈ ఏడు సూత్రలులను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపిన ఆయన.. ఈ సప్తపది విజయాన్ని అందించే మార్గం అని అన్నారు. విజయం సాధించేందుకు మనం నిష్టగా చేయాల్సిన పనులు ఇవి అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకూ ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిష్టగా పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు