ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకాల పంపిణీ బంద్... ఎందుకంటే..

సోమవారం, 10 మే 2021 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు(సోమ, మంగళ) పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపి వేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
ఇకపై వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర జనం గుమిగూడితే అధికారులపై చర్యలు తీసుకోనుంది. ఇదిలావుంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారాన్ని స్లిప్పుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండో డోసు పూర్తయ్యేకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి పెరిగింది.
 
ఇక తాజాగా రాష్ట్రంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 18,832 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 12,87,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,88,264 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,90,632 మంది చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు