కక్షసాధింపులు తర్వాత.. కరోనా కట్టడిపై దృష్టిసారించండి... సీపీఐ రామకృష్ణ

సోమవారం, 17 మే 2021 (10:41 IST)
కరోనాతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కక్షపూరిత విధానాలు అవలంభిస్తున్నారనీ, కక్షలకు పోకుండా కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజల ప్రాణాలు బలిగొంటుంది. మే నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలో దాదాపు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. మార్చి నెలలో రాష్ట్రమంతా 12 వేల కేసులు రాగా, ఏప్రిల్ నెలలో 99 వేల కేసులు వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజూ 100 మంది వరకు చనిపోతున్నారు. 
 
మరో వారం, 10 రోజుల్లో ఎపీలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 10 వేలకు చేరుతుంది. ఇంత తీవ్రమైన పరిస్థితులుంటే ప్రభుత్వం కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, సరైన వైద్య సదుపాయం అందించలేకపోతోంది. అనంతపురంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, కోవిడ్ కేర్ నోడల్ ఆఫీసర్‌కు కూడా ఐసియూ బెడ్ దొరకలేదు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా విలయాన్ని ఎదుర్కోవడాన్ని విస్మరించి, గ్రామాలకు ఇంటర్నెట్ ఇస్తామంటూ, డబ్బులేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. కరోనా కట్టడికై కేంద్ర ప్రభుత్వంతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, ప్రతిపక్షాల సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని, వారిని కలుపుకుని పోతున్నారు. 
 
కానీ ఎపీలో ఇప్పటివరకూ సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎపీలో కరోనా డేంజరస్ స్థితికి చేరుకుందని, గ్రామాలకు కూడా విస్తరిస్తుందని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. సిఎం జగన్ మాత్రం గ్రామాలకు ఇంటర్నెట్ ఇస్తామంటున్నారేగాని, ఆక్సిజన్ గురించి మాట్లాడడం లేదు. హోం ఐసోలేషన్ ఉన్నవారికి అవసరమైతే ఆక్సిజన్ అందిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెబుతున్నారు.
 
 
ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎజెండా అమలుకు పూనుకుంటున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై, ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసులుపెట్టి అరెస్టు చేయించారు. ఎబిఎన్, టివి5 ఛానళ్లపై, మీడియా సంస్థలపై కూడా కేసులు పెడుతున్నారు. 
 
ఎంపీని లాక్కెళ్లి అరెస్ట్ చేయడమే తప్పంటుంటే, పోలీసులకు ముసుగులు వేయించి రౌడీలా మాదిరిగా ఎంపీని కొట్టించడం సరైందేనా అన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రత్యర్థులపై కక్షపూరిత విధానాలు అవలంభించడానికి ఇది సరైన సమయం కాదు. తక్షణమే రఘురామకృష్ణంరాజుపైన, మీడియా సంస్థలపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 
 
రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప అధికారముందనే అహంకారంతో పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే ఖచ్చితంగా తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదు. ఇప్పటికైనా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారం తీసుకోవాలి. అవసరమైతే కేరళ రాష్ట్ర తరహాలో మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా అని రామకృష్ణ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు