పంచాయతీ పోరుపై సుప్రీం తీర్పు హర్షణీయం : సీపీఐ రామకృష్ణ

సోమవారం, 25 జనవరి 2021 (15:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీలో పంచాయతీ పోల్స్‌ నిర్వహణకు పచ్చజెండా ఊపుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శిరోధార్యంగా భావించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. 
 
కాగా, ఏపీ పంచాయతీ ఎన్నికలపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పును పరిశీలిస్తే, రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. 
 
ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని గుర్తుచేసింది. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్‌ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు