అలాగే, ఈ ప్రమాదంలో మరణించిన వారికి శవపరీక్షలు చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికను ఆయన వైద్యులను అడిగి తీసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టమ్ నివేదికను జగన్ జేబులో పెట్టుకోబోతుండగా వైద్యులు ‘‘సార్.. సార్... అవి ఒరిజినల్ రిపోర్టులు. మీకు ఫొటోస్టాట్ ఇస్తాం’’ అని ఆపబోయారు.
దీనికి జగన్.. ‘‘మూడు కాపీలు ఉన్నప్పుడు ఒక కాపీ ఇవ్వడానికి ఏంటి?’’ అంటూ వాగ్వాదానికి దిగారు. నివేదికను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ‘‘చెయ్యి తియ్.... చెయ్యి తియ్....’’ అంటూ వాటిని ఆయన లాక్కున్నారు. ‘‘ఇది డాక్టర్ కాపీ సార్....’’ అని చెప్పగా.. ‘‘నేను ప్రతిపక్ష నాయకుడ్ని. నాకే నివేదిక ఇవ్వరా?’’ అని మండిపడ్డారు.
ఆ దశలో జిల్లా కలెక్టర్ బాబు జోక్యం చేసుకుని జగన్ నుంచి పోస్టుమార్టం నివేదికను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా, ‘‘పోలీసుల నుంచి కలెక్టర్ దాకా అధికారులందరూ అవినీతిపరులు’’ అని తీవ్రస్వరంతో అన్నారు. నిన్ను కూడా సెంట్రల్ జైలుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి అంటూ కలెక్టర్ ఒంటిపై చేయి వేసి హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జగన్‌పై నందిగామలో క్రిమినల్ కేసు నమోదైంది.