ఏపీ సచివాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలితం వల్లే దేశంలో స్వేచ్ఛా వాయువులకు ఆస్కారం కలిగిందన్నారు.
ప్రతి ఏటా స్వాతంత్ర్య సమరయోధుల సేవలను కొనియాడుతూ, ఆనందోత్సవాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. కరోనా మహమ్మారితో దేశం మొత్తం పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు.
ఈ పోరాటంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా అధికారుల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యం, పోలీసు, పారిశుద్ధ్యం, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల ఉద్యోగులు... కరోనా నివారణకు అహర్నిశలూ కృషి చేస్తున్నారని, వారి సేవలు అమోఘమని సీఎస్ నీలం సాహ్ని కొనియాడారు.
27 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కరోనా నేపథ్యంలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ఒకవైపు నిత్యావసర సరకులు అందిస్తూనే, మరో వైపు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
గత అయిదేళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అయినప్పటికీ ప్రజారోగ్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రానున్న నాలుగు నెలల తన పదవీ కాలంలో రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేస్తానని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు.
అంతకుముందు ఆమె... సచివాలయం భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, లా సెక్రటరీ జి.మనోహర్ రెడ్డి, స్టాఫ్ ఆఫీసర్ టూ సీఎస్వి జయకృష్ణన్, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.