అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చంద్రబాబు ఏం చేశారు?: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

మంగళవారం, 7 జులై 2020 (07:58 IST)
నిజం చెప్పకూడదన్న శాపం చంద్రబాబుకు ఉందని, ఒకవేళ నిజం చెబితే ఆయన తలకాయ వెయ్యి ముక్కలు అయిపోతుందని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అందుకే ఏమో.. చంద్రబాబు జీవితంలో నిజం చెప్పడని అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలు తప్పు చేస్తే.. చంద్రబాబు కులాలు, మతాలు అంటకట్టడం ఏంటని అనిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు నేరాలు, తప్పులు చేసినా కులానికి, మతానికి సంబంధం ఏమిటి చంద్రబాబూ అని అనిల్ ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించకపోవటం తప్పు కానీ, నేరం చేసిన వారిని శిక్షిస్తే ఏ రకంగా తప్పు అని చంద్రబాబును అనిల్ నిలదీశారు. 
 
టీడీపీ బీసీ నేతలైన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర ప్రభుత్వం వేధిస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరి, మచిలీపట్నంలో హత్యకు గురైన వ్యక్తి బీసీ కాదా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని స్పష్టంగా తెల్సిన తర్వాతే అరెస్ట్ చేశారని తెలిపారు.

తప్పు ఏమీ చేయకపోతే గోడదూకి పోవాల్సిన అవసరం కొల్లు రవీంద్రకు ఏమొచ్చిందన్నారు. చనిపోయిన వ్యక్తి కూడా ఒక బీసీయేనని అనిల్ తెలిపారు. అలాగే అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడితే బీసీ అనటం ఏంటని అనిల్ ప్రశ్నించారు. అవినీతి, హత్య కేసుల్లో ఇరుక్కున్న వారికి బీసీ కార్డును అంటగట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయటంపై అనిల్ మండిపడ్డారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు సమర్థిస్తారా? అని అనిల్ నిలదీశారు.
 
ఈరోజు కొల్లు రవీంద్ర విషయమే తీసుకుంటే మోకా భాస్కరరావు హత్య కేసు ఏదైతే ఉందో.. స్పష్టమైన ఆధారాలతో కొల్లు అరెస్ట్ జరిగిందన్నారు. మోకా భాస్కరరావు హత్యకు వారం ముందు దీనిపై కొల్లుతో సంభాషణ జరిగిందని అనిల్ అన్నారు. చనిపోయిన తర్వాత కొల్లు పీఏకి ఫోన్‌ చేస్తే.. అతని ఫోన్‌ నుంచే కొల్లు రవీంద్ర మాట్లాడారని వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారని అనిల్ తెలిపారు.

చంపబడ్డ వ్యక్తి బీసీ కాదా? చంపబడ్డ వ్యక్తి ఓ మత్స్యకారుడు కాదా? చంపబడ్డ వ్యక్తి కుటుంబం రోడ్డు మీద పడి ఆయన భార్యా పిల్లలు రోదిస్తున్న తీరు చంద్రబాబుకు కనపడటం లేదా అని అనిల్ ప్రశ్నించారు. గతంలో వారికి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేస్తారా? పాత కక్షలుంటే ఆ వ్యక్తిని చంపేయంటారా? వారు బీసీలు కాదా? వారు మనుషులు కాదా? అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఒక మర్డర్ కేసుకు సంబంధించి అనుచరులను ప్రోత్సహించి హత్య జరిగిన తర్వాత మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది తప్పెలా అవుతుందని అనిల్ ప్రశ్నించారు. నిజంగా కొల్లు రవీంద్ర ఏ తప్పు చేయకపోతే ఇంట్లో నుంచి గోడదూకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనిల్ నిలదీశారు. తప్పు చేశారు కాబట్టే.. కొల్లు రవీంద్ర భయంతో గోడ దూకి పారిపోయారన్నారు.

ఎక్కడైనా తప్పు చేసిన వ్యక్తి ఒకచోటకు వస్తే పక్క నుంచి పోలీసు వెళ్తుంటే భయంతో వణికిపోయి పారిపోతారని లేకపోతే తప్పు చేయని వ్యక్తి అక్కడే ఉంటారన్నారు. కొల్లు తప్పు చేశాడు కాబట్టే పోలీసులు వస్తున్నారని తెల్సి గోడదూకి పారిపోయారని అనిల్ తెలిపారు. మత్స్యకారుడ్ని హత్య చేసి రోడ్డు మీద పడేసిన కొల్లు రవీంద్రను చంద్రబాబు వెనకేసుకురావటం ఏంటని అనిల్ మండిపడ్డారు. 
 
ఇక అయ్యన్నపాత్రుడు విషయానికి వస్తే... అయ్యన్నపాత్రుడు అన్నమాటలు, భాష చూస్తే కౌరవ సభ గుర్తుకు రాలేదా చంద్రబాబూ అని అనిల్ ప్రశ్నించారు. కౌరవసభలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేత ద్రౌపది చీర ఎలా లాగించారో .. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక మహిళాధికారిణి పట్టుకొని బట్టలు ఊడదీసి కొడతాను అన్న మాటలు దుశ్శాసనుడు చేష్టలు గుర్తుకు తేలేదా చంద్రబాబూ అని అనిల్ నిలదీశారు.

అయ్యన్నపాత్రుడు భాషను, చేష్టలను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అది కరెక్టేనా అని అనిల్ అడిగారు. అయ్యన్నపాత్రుడుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బీసీ అని అంటకడతావా చంద్రబాబు అని అనిల్ నిలదీశారు.
 
బీసీ అయి ఉండి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి మీరు అన్యాయాలు చేయించేసి తర్వాత కులాన్ని తెచ్చి తప్పించుకోవాలనుకుంటారా? బట్టలు ఊడదీసి కొడతాను అన్న మాటను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని అనిల్ చంద్రబాబును ప్రశ్నించారు. ఒక మర్డర్‌ను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని అనిల్ ప్రశ్నించారు.
 
అచ్చెన్నాయుడు సాక్ష్యాధారాలతో సహా లేఖ రాసి.. అడ్డంగా దొరికిపోయారని అనిల్ తెలిపారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ మందులు కుంభకోణం చేశారు. ఈఎస్‌ఐలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్మికులు ఉన్నారు. ప్రతి దానికీ తప్పు చేసి అడ్డంగా దొరికితే కులాన్ని తెచ్చే పని చంద్రబాబు చేయటంపై అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర చంపించింది ఒక బీసీని. మత్స్యకారుడు కుటుంబాన్ని. అచ్చెన్నాయుడు దోపిడీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలున్నారు.

అయ్యన్నపాత్రుడు మహిళను బట్టలూడదీసి కొడతాను అన్నారు. ఇవేమీ చంద్రబాబుకు కనపడటం లేదా? ఇష్టానుసారం చంద్రబాబు మాట్లాడుతున్నారు. బీసీలపై ప్రేముంటే ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టావో చెప్పు బాబూ అని అనిల్ నిలదీశారు. కనీసం రూ.15వేల కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు పెట్టలేదని అనిల్ తెలిపారు.

వైయస్ జగన్ ఏడాదిలో సంక్షేమానికి 3.57 కోట్ల మందికి రూ.40 వేల కోట్లు ఖర్చు పెడితే అందులో 1.78 కోట్ల మంది బీసీలున్నారు. బీసీల కోసం రూ.20 వేల కోట్లు వైయస్‌ జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అనిల్ తెలిపారు. 
 
బీసీలపై పేటెంట్ హక్కులా చంద్రబాబు ఊడిగం చేయించుకున్నారని అనిల్ మండిపడ్డారు. బీసీల చేత చాకిరి చేయించుకొని ఓటు బ్యాంకు కోసం టీడీపీ వాడుకుందని అనిల్ విమర్శించారు. ఈరోజు 1.78 కోట్ల మంది బీసీలకు రూ.20 వేల కోట్లు జగన్న ప్రభుత్వం ఖర్చు చేయటం జరిగిందన్నారు. 2014-19 మధ్య రూ.1850 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వెళ్లిపోయారు.

ఆ బకాయిలను ఈ ఏడాదితో సహా పూర్తిగా జగన్ ప్రభుత్వం చెల్లించటం జరిగిందని అనిల్ తెలిపారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి అని అనిల్ స్పష్టం చేశారు. 
 
ప్రతిపక్ష టీడీపీనే మోకా భాస్కర్‌ రావును చంపటం జరిగింది. టీడీపీనే అరాచకం, రౌడీయిజం చేస్తోంది. బట్టలూడదీసి కొడతామని ఓ మహిళను అన్నది టీడీపీ నాయకుడు కాదా అని అనిల్ ప్రశ్నించారు. దోపిడీలు, నేరాలు చేసిన వారిని అరెస్ట్  చేయటానికి వెళ్తే బీసీల ప్రస్తావన తేవటం ఏంటి; సిగ్గులేదా చంద్రబాబు అని మంత్రి అనిల్ మండిపడ్డారు.

సంక్షేమంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అర్థ భాగం ఇస్తున్నామన్నారు. ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఉండాలని నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం జగన్ ప్రభుత్వం కల్పిస్తోందని అనిల్ తెలిపారు.
 
నేరం చేసిన వారిని కాపాడితే తప్పు అవుతుంది కానీ నేరం చేసిన వాడ్ని శిక్షిస్తే తప్పు ఎలా అవుతుందని అనిల్ ప్రశ్నించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కానీ, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి కానీ, పార్టీ నాయకులు కానీ ఏనాడూ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయలేదని అనిల్ తెలిపారు.

జగన్ నాకు మంత్రి పదవి ఇస్తే గొర్రెలు, బర్రెలు కాసుకునేవాడికి మంత్రి పదవి ఏంటని పెయిడ్ ఆర్టిస్టుల చేత మాట్లాడించింది చంద్రబాబు కాదా అని అనిల్ గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నోటీసు ఇప్పించి కేసు కూడా కట్టలేకపోయారు. సాక్ష్యం కూడా లేదు. బీసీ ఎమ్మెల్యేను అయిన నా వ్యక్తిత్వహననానికి చంద్రబాబు ప్రయత్నించారని అనిల్ మండిపడ్డారు.

మేం బీసీలం కాదా? మాకు ఆత్మాభిమానం లేదా? మీరు (టీటీపీ) చులకన చేస్తే ఆనాడు కేసులు కూడా పెట్టలేదని అనిల్ గత సంఘటనల్ని గుర్తు చేశారు. పైగా ఈరోజున బీసీల గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటని అనిల్ ప్రశ్నించారు. బీసీల ఆత్మాభిమానం కాపాడే నాయకుడు వైయస్‌ జగన్ మోహన్ రెడ్డే అని అనిల్ స్పష్టం చేశారు.
 
మండలిలో దీపక్‌ రెడ్డి, రాజేంద్రప్రసాద్ చౌదరి, లోకేశ్ బాబు చౌదరి, ఇంకో ఆయన అశోక్‌ బాబు నా కేరక్టర్ దెబ్బతీయటానికి మహిళలు ఉన్నప్పుడు అనిల్ జిప్పు విప్పదీశారని మాట్లాడారు. మండలిలో మీ ఛైర్మన్‌ ఉన్నారు కదా.. లెటర్ ఇచ్చాను. ఇప్పటికే 15 రోజులు అయింది. టీడీపీ నేతలు చెప్పిన టెర్మినాలిటీ ప్రకారం నేను మండలిలో చేశానా? లేదో ఆ వీడియో చూస్తే తెల్సిపోతుందని అనిల్ అన్నారు.

మరి, ఎందుకు వీడియో రిలీజ్ చేయించుకోలేకపోయారని టీడీపీ నేతలను అనిల్ ప్రశ్నించారు. రుజువు చేయమని లెటర్ కూడా ఇచ్చానని అనిల్ నిలదీశారు. ఇతర పార్టీల్లోని బీసీ నేతల ఇమేజీ డ్యామేజీ చేయటానికి మాత్రం టీడీపీ ముందు ఉంటుందని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తప్పు చేయలేదని సమర్థిస్తూ మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలని అనిల్ మండిపడ్డారు.

2019లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వైయస్‌ జగన్ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఓటేశారని అనిల్ తెలిపారు. కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోండని టీడీపీకి అనిల్ హితవు పలికారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణమా, కులం, మతం, ప్రాంతం అన్నది చూడదని అనిల్ స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఈ విషయం తెలియకపోవటం సిగ్గుచేటని అనిల్ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు