దళితులు ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారు: కత్తి మహేశ్
శనివారం, 16 నవంబరు 2019 (19:36 IST)
ఉన్నత స్థానాలకు ఎదగాలనే కోరికతోనే దళితులు ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారని సినీ విమర్శకుడిగా, సంచలన వ్యాఖ్యాతగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు.
ఈయన తెలుగు మాధ్యమాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లీషు మాధ్యమమే ఎందుకు ఉండాలో కత్తి మహేశ్ చెబుతున్న కారణాలు ఆయన మాటల్లోనే...
‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు భాష అవసరం పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యంఇంగ్లీషుకే ఇస్తున్నారు. తెలుగు భాషకు అలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ ఉంది.
అందుకే తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంవైపే మొగ్గు చూపుతున్నారు. తెలుగు అమ్మ భాషగా మనకు ఉంటుంది. ఇంట్లో మాట్లాడుకోవచ్చు. సంపన్నుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. డబ్బులేని దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు విధిలేక మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు.
అందుకే వీరిలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. పేద దళిత వర్గాలు తెలుగుకే పరిమితం కావాలా? తెలుగు భాషను కాపాడే బాధ్యత దళితులదా? ఇది చాలా అన్యాయం. దళితవర్గాల ఎదుగుదలకూ, ఆత్మగౌరవానికీ ఇది అడ్డంకిగా మారుతుంది.
ఉన్నత స్థానాలకు ఎదగాలనే కోరికతోనే దళితులు ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారు. చిన్న పిల్లలకు గ్రాహ్యశక్తి బాగా ఉంటుంది. ఇంటి భాష తెలుగు, బడి భాష ఆంగ్లం అయినపుడు రెండూ నేర్చుకుంటారు. తెలుగు మాధ్యమం లేకుంటే మాతృభాషకు అన్యాయం జరుగుతుందనే వాదన అసత్యం, అర్థం లేనిది.
విజ్ఞాన శాస్త్ర పదాలు అన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. ఈ విషయం మనం గమనించాలి. తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టుకుని మిగిలిన సబ్జెక్టులన్నీ ఆంగ్లంలో ఉండటం వలన జరిగే నష్టం ఏమీ లేదు. ఉన్నత చదువులన్నీ ఆంగ్ల భాషలోనే ఉన్నపుడు ప్రాథమిక విద్య ఆంగ్లంలో ఉంటే తప్పేంటి?
ఆంగ్ల చదువుల కోసం ఏటా ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రజలు రూ.5 లక్షల కోట్లు ఇస్తున్నారు. మన రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంతలేదు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది.
ఆంగ్లమాధ్యమం పటిష్ఠంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు అంచెలంచెలుగా శిక్షణ ఇస్తే బాగుంటుంది. ఇందుకు కనీసం ఐదేళ్ల వ్యవధి అవసరమని నా అభిప్రాయం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే ముందు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."