విజయవాడ: ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభం అయిన దాండియ కార్యశాల ఆహాతులను ఉత్సాహపరిచింది. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసే క్రమంలో క్రియెటివ్ సోల్ నిర్వహిస్తున్న వర్క్ షాప్ బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది. కళలతో దేశ సమైఖ్యతను చాటేలా విజయవాడ యువతీయువకుల కోసం గుజరాతీ, రాజస్థానీ పడతులు నిర్వహిస్తున్న దాండియా శిక్షణా కార్యక్రమం 21 రోజుల పాటు నిర్వహించనుండగా, సెప్టెంబరు 16వ తేదీ నుండి పూర్తిస్థాయి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని క్రియెటివ్ సోల్ వ్యవస్ధాపకురాలు సుమన్ మీనా పేర్కొన్నారు.
దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారతదేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి నృత్యం చేస్తారన్నారు. ఉదయం పది గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగే శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు చేసామని మీనా వివరించారు. కార్యశాల ప్రారంభానికి ముందస్తుగా శనివారం నాటి ప్రత్యేక ప్రదర్శన చేపట్టామని, శిక్షణా కార్యక్రమానికి నగర వాసుల నుండి లభించిన స్పందన అనిర్వచనీయమైనదని సుమన్ మీనా వివరించారు.
దాండియా మహిళలకే పరిమితమైన అంశం కాదన్న విషయం ప్రస్తుత ప్రదర్శనలో స్పష్టం కాగా, ప్రత్యేకించి పురుషులు సైతం యువతులతో పోటీ పడి మరీ నృత్యం చేసారు. క్రియేటివ్ సోల్ సహ వ్యవస్దాపకురాలు నేహా జైన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు ప్రత్యేకరాయితీతో శిక్షణ అందిస్తున్నామన్నారు. వర్క్‌షాప్ నేపధ్యంలో సెప్టెంబరు 29, 30 తేదీలలో రెండు రోజులు ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని, దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీసంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తారని నేహా జైన్ పేర్కొన్నారు.
గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శన ఉంటుందని మరిన్ని వివరాలకు 9849468498, 9949275912 నెంబర్లతో సంప్రదించవచ్చని నేహా జైన్ పేర్కొన్నారు. దాండియా, గర్భా నృత్యాలు నేర్చుకోవాలనుకునే వారికి తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామన్నారు. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ వారి ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకుశిక్షణాకాలంలో రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామన్నారు.