గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ సతీమణి షహనాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
ఫరూఖ్ సతీమణి మరణించారని వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చంద్రబాబు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఫరూఖ్ కుటుంబ సభ్యులు ఉండాలని సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వేర్వేరు పత్రికా ప్రకటనల్లో పేర్కొన్నారు.
కాగా, మంత్రి ఫరూఖ్ అర్థాంగి పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆమెకు జన్నత్‌లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఫరూఖ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.