ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 జరిగిన ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైకాపా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోడానికి కారణం ప్రతి ఒక్క వర్గాన్ని కెలకడం, ప్రతి పుట్టులో వేలుపెట్టడం. చిత్తుగా ఓడిన తర్వాత ఈవీఎంలు వల్ల ఓడిపోయాం అనే ఓ కుంటి సాకు చెబుతున్నారు. బొక్కలన్నీ జేబులో పెట్టుకొని ఈవీఎంలపై నెపం నెడితే ఉపయోగం లేదంటూ వైకాపా నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా, గత ఎన్నికల్లో తాము చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలను వైకాపా నేతలు ఇపుడిపుడే గ్రహిస్తున్నారు. ఇలాంటి వారిలో ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడమే తమ కొంప ముంచిందన్నారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడమంటే కొరివితో తల గోక్కోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తమ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు.