సినిమా టిక్కెట్ల రాజకీయం చివరికి కామెడీకి దారితీస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి తెలుగు సినిమా ప్రముఖులు ఎవరూ ముందుకు రాకపోగా, నేనున్నా అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరంగేట్రం చేశారు. ఏనాడూ పరిశ్రమ సమస్యలపై స్పందించని, కనీసం పట్టించుకోని వర్మ ఇపుడు, అదే పరిశ్రమ సమస్యలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడేందుకు వస్తున్నారు.
నేడు మంత్రి పేర్ని నానితో భేటీ కానున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై చర్చిస్తారా? లేక తనదైన శైలిలో వితండ వాదం చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం 12.30 గం.కు సచివాలయంలో సమావేశం కానున్న ఆర్జీవీ సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించనున్నారు. సినిమా టికెట్ ధరలపై ఇటీవల పేర్ని నాని, ఆర్జీవీ మధ్య ఇటీవల ట్వీట్ వార్ నడిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ సమస్యలు వివరించడానికి వర్మ మంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. దీనికి స్పందించిన మంత్రి త్వరలోనే కలుస్తానని చెప్పారు. దీంతో వీరిద్దరూ నేడు భేటీకానున్నారు. అయితే ఇదంతా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నుంచి అందరి ఆలోచనలను డైవర్ట్ చేయడానికా? లేక సీరియస్ డిస్కషన్ జరుగుతుందా అనే అనుమానాలను సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు సినీ పరిశ్రమతో ఎపుడూ విభేదించే వర్మ, ఇపుడు ఏ సాధికారితతో ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్నది అర్ధం కావడం లేదని అటు పరిశ్రమ వర్గాలు, ఇటు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.