ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ: రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

గురువారం, 21 జనవరి 2021 (20:20 IST)
విజయవాడ: ఇంటింటికీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల పంపిణీకి ఉద్దేశించిన 9260 మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
విజయవాడ బెంజిసర్కిల్లో గురువారం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2500 వాహనాలకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పచ్చజెండా ఊపారు. వీటితోపాటు మళ్లీ మళ్లీ వినియోగించుకునేందుకు వీలున్న నార సంచులను సీయం ఆవిష్కరించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పేద, నిరుపేద కులాలకు చెందిన 9260 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 539 కోట్ల వ్యయంతో 9260 వాహనాలను సమకూర్చడం జరిగింది. ఈ పథకం అమలువలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 830 కోట్ల మేర అదనపు ఖర్చును కూడా భరిస్తుంది. సుమారు 45 నిమిషాలపాటు ముఖ్యమంత్రి వేదిక పైనుండి ప్రారంభించిన వాహనాలు కుయ్.... కుయ్.... మంటూ శబ్దం చేస్తూ ముందుకు వెళ్లగా, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి తొలి వాహనం నుండి చివరి వాహనం వరకు ఉండి ముకుళిత హస్తాలతో వాహన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు.
 
రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఈ వాహనాల కోసం 60 శాతం సబ్సిడీని అందించడంతో పాటు ప్రతీ నెల 18 రోజుల పని దినాలు కల్పిస్తూ ఈ సంవత్సరాల పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పోరేషన్ ద్వారా అందించిన వాహనాలు యస్సీ కార్పోరేషన్ 2300, యస్టి కార్పోరేషన్ 700, బిసి కార్పోరేషన్ 3800, మైనారిటీ కార్పోరేషన్ 660, ఎకనామికల్లీ బ్యాక్ వార్డ్ (ఇడబ్ల్యు/ఇ-బి) కార్పోరేషన్ ద్వారా 1800 వాహనాలను అందజేశారు.
 
యూనిట్ కాస్ట్ రూ. 5,81,00/-లు కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600/-లు అందించింది. బ్యాంక్ లింకేజ్ ద్వారా రూ. 1,74,357/-లు మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటాగా కేవలం రూ. 58,000/-లు చెల్లించాల్సి ఉంది. బ్యాంక్ లింకేజ్ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌరసరఫరాలశాఖ ప్రతీ నెలా అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు.
 
పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గృహనిర్మాణశాఖామంత్రి చెరుకూరి శ్రీరంగనాధరాజు, బిసి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, బ్రాహ్మణకార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఏపియన్ యఫ్ యల్ ఛైర్మన్ పి.గౌతం రెడ్డి, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, శాసన సభ్యులు కొలుసు పార్థసారథి, మేకా వెంకటప్రతాప అప్పారావు వున్నారు.
 
ఇంకా వీరితో పాటు కె.రక్షణనిధి, సింహాద్రి రమేష్, వల్లభనేని వంశీ మోహన్, యం.జగన్మోహనరావు, మెరుగు నాగార్జున, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు, పలువురు, స్థానిక ప్రజాప్రతినిధులు బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరు, కోన శశిధర్, కృష్ణా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, గుంటూరు కలెక్టరు శ్యామ్యూల్ ఆనంద్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు దేవు ముత్యాలరాజు, మూడు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 
తొలుత సభావేదిక చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు