వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ రోజున ‘ఇళ్ల పట్టా’భిషేకం

బుధవారం, 23 డిశెంబరు 2020 (19:27 IST)
‘రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇబ్బంది పడకూడదు. ఒక్కరు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండొద్దు. ఏదైనా ఊళ్లోకి వెళ్లి, అక్కడ ఇంటి స్థలం, ఇల్లు లేని వారెవరైనా ఉన్నారా? అంటే ఒక్కరు కూడా చేయి ఎత్తే  పరిస్థితి ఉండకూడదు.

శాచురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తాం. ఇల్లు కూడా కట్టించి ఇస్తాం’.. నాడు విపక్షనేతగా ఉన్నప్పటి నుంచి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాలలో సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన మాటలు ఇవి. చెప్పిన మాటకు కట్టుబడి ఉండి నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.
 
నవరత్నాలు
దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న నిరుపేదలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాలులో భాగంగా నిరుపేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేస్తున్నారు. 
 
విపక్షం కుట్రలతో వాయిదా:
ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ ఏడాది ఉగాది పండగ రోజు (మార్చి 25)న ప్రారంభించాలని ప్రభ్వుత్వం తొలుత నిర్ణయించింది. అయితే దేవతల యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లుగా, ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విపక్షం కుట్రలు, కుతంత్రాలు చేసి, కోర్టుల్లో కేసులు వేయించి కార్యక్రమాన్ని అడ్డుకుంది.

ఆ తర్వాత అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14, వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30, దివంగత మహానేత వైయస్సార్‌ జయంతి జూలై 8, స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15, చివరగా గాంధీ జయంతి రోజు అక్టోబరు 2న కార్యక్రమాన్ని ప్రారంభించాలని తలపెట్టినా సాధ్యం కాలేదు.
 
వైకుంఠ ఏకాదశి పర్వదినాన:
ఈ నేపథ్యంలో కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు మినహా, మిగతా చోట్ల శుక్రవారం వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ’పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తూర్పు గోదావరి జిల్లా యూ.కొత్తపల్లిలో సీఎం వైయస్‌ జగన్‌ ‘ఇళ్ల పట్టా’భిషేకంలో పాల్గొంటారు. ఆ తర్వాత 15 రోజుల పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తారు.
 
ఎంత మంది లబ్ధిదారులు:
పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇప్పటి వరకు మొత్తం 30,75,755 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో 23,37,067 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేసిన 17 వేలకు పైగా ‘వైయస్సార్‌ జగనన్న కాలనీ’ లేఅవుట్లలో ఇంటి స్థలం ఇస్తారు. ఇప్పటికే స్థలాలు అక్రమించి ఉంటున్న 4,86,820 మందికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరిస్తారు. మిగిలిన 2,51,868 మందికి ఏపీ టిడ్కో నిర్మించే ఇళ్లు కేటాయిస్తారు.
 
ఎంత భూమి? ఎంత విలువ?:
అర్హులైన పథకం లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు భూమి ఇస్తారు. మొత్తం రూ.23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వబోతున్నారు. 
ఇందులో ప్రభుత్వ భూమి 25,120.33 ఎకరాలు (విలువ దాదాపు రూ.8 వేల కోట్లు) కాగా, రూ.10,150 కోట్ల ఖర్చుతో 25,359.31 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.

విశాఖపట్నంలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో 4457.05 ఎకరాలు (విలువ దాదాపు రూ.1350 కోట్లు), రాజధాని అమరావతి ప్రాంతంలో ఏఎంఆర్‌డీఏకు చెందిన 1074.18 ఎకరాలు (విలువ దాదాపు రూ.325 కోట్లు), టిడ్కో ఇళ్ల కోసం రూ.810 కోట్ల ఖర్చుతో 2550.96 ఎకరాలు సేకరించగా, ఇళ్ల స్థలాలుగా క్రమబద్ధీకరణ (ఇప్పటికే ఆక్రమించుకుని ఉంటున్న వారికి) చేయనున్న భూమి మరో 9800 ఎకరాలు (విలువ దాదాపు రూ.2900 కోట్లు) ఉంది.
దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా కేవలం ఒక్క రూపాయికే ఇంటి స్థలం పట్టా ఇస్తారు. ఆ స్థలం కూడా ఆ ఇంటి సభ్యురాలి (అక్క  లేదా చెల్లి లేదా అమ్మ)పేరుతో ఇస్తారు.
 
పేదలందరికీ ఇళ్లు:
అర్హులైన నిరుపేదలకు కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చి ఊర్కోకుండా రెండు దశల్లో వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఆ మేరకు తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం నాడే పనులు ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. రెండు దశల్లో మొత్తం 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తోంది.
 
విస్తీర్ణం–సదుపాయాలు:
340 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్లు నిర్మిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కూడా ఆ ఇంటిలో ఏర్పాటు చేస్తారు. నీటి కనెక్షన్, టాయిలెట్‌ సదుపాయం కూడా ఉంటుంది.
 
ఏ దశలో ఎన్ని లేఅవుట్లలో?:
తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను 175 నియోజకవర్గాలలోని 8,929 లేఅవుట్లలో నిర్మిస్తుండగా, రెండో దశలో కూడా అన్ని నియోజకవర్గాలలోని 7,141 లేఅవుట్లలో 12.70 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఆ ఇళ్ల కోసం రూ.22,860 ఖర్చు చేయనున్నారు. పక్కా నాణ్యతతో నిర్మించే ఇళ్లను ఐఐటీ, ఎన్‌ఐటీకి చెందిన నిపుణులతో (థర్డ్‌ పార్టీ) తనిఖీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఒక్క రూపాయికే 300 చ.అడుగుల ఇల్లు:
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టిడ్కో ఇప్పటికే 2,62,216 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంతో మూడు అంతస్తులలో ఆ ఇళ్లు (ఫ్లాట్లు) నిర్మిస్తున్నారు.వాటిలో 300 చ.అడుగుల ఇంటికి సంబంధించి లబ్దిదారుడి నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటారు. అంటే ఒక్క రూపాయికే 300 చ.అడుగుల ఇంటిని ఆ నిరుపేద కుటుంబానికి ఇస్తారు. ఆ మేరకు అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తారు.
 
మిగిలిన వారికీ 50 శాతం రాయితీ:
అదే విధంగా 365 చ.అడుగుల ఇంటి లబ్ధిదారుడు తన వాటాగా రూ.50 వేలు, 430 చ.అడుగుల ఇంటి లబ్ధిదారుడు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం వారికి కూడా 50 శాతం రాయితీని ప్రకటించింది. ఆ మేరకు 365 చ.అడుగుల ఇంటి లబ్ధిదారుడు కేవలం రూ.25 వేలు, 430 చ.అడుగుల ఇంటి లబ్ధిదారుడు కేవలం రూ.50 వేలు తమ వాటాగా చెల్లిస్తే సరిపోతుంది. ఆ రాయితీని ప్రభుత్వమే భరించనుంది. టిడ్కో ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, ఈ రాయితీలను కూడా కలుపుకుంటే మొత్తం రూ.7,251.80 కోట్ల భారం పడుతోంది.
 
టిడ్కో ఇళ్లు–లబ్దిదారులు:
టిడ్కో ఇళ్లలో 300 చ.అడుగుల ఇళ్లకు సంబంధించి 1,43,600 మంది, 365 చ.అడుగుల ఇళ్లకు సంబంధించి 44,304 మంది, 430 చ.అడుగుల ఇళ్లకు సంబంధించి 74,312 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి కూడా శుక్రవారం నుంచే సేల్‌ అగ్రిమెంట్లు ఇవ్వనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు