కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తులతో పాటు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎంతో శ్రమిస్తూ ముందు వరుసలో ఉన్నారు.
ఈ వైరస్ పట్ల భయాలు మరియు సంక్రమణ గురించి కమ్యూనిటీలలో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కారణంగా ప్రజల నుండి వీరంతా వివక్షను ఎదుర్కొంటున్నారు.
అంతే కాకుండా కోవిడ్-19 నుండి కోలుకున్న వారు సైతం అలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వివక్ష, పక్షపాతాలను ఎదుర్కోవటానికి ప్రజలకు వైరస్ పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ విషయంలో బాధ్యతాయుతమైన పౌరులందరూ ఈ కింద తెలిపిన విషయాలను చదివి అర్థం చేసుకొని సహకరించాలని సూచించడం జరిగింది:
1. కోవిడ్-19 ఇది అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి మరియు మనలో ఎవరికైనా సోకుతుంది. అయినప్పటికీ సామాజిక దూరం పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మరియు తుమ్ము /దగ్గు వచ్చినప్పుడు మోచేతులను లేదా టిస్యూ పేపర్ అడ్డుపెట్టుకోవడం వంటి చర్యల ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
2. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరైనా వైరస్ బారిన పడితే అది వారి తప్పు కాదు. అలాంటి పరిస్థితిలో రోగికి మరియు రోగి కుటుంబానికి మద్దతు మరియు సహకారం ఎంతో అవసరం. వైరస్ కి చికిత్స చేయగల పరిస్థితులు ఉన్నాయని మరియు చాలా మంది ప్రజలు వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నారని గమనించాలి
3. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో సంరక్షణ మరియు వైద్య / క్లినికల్ సహాయాన్ని అందించడానికి వైద్యులు, నర్సులు మరియు అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా ఆరోగ్య సంరక్షణ కార్మికులు తమ వంతు సేవలను నిర్విరామంగా అందిస్తున్నారు. కోవిడ్-19 సవాలును పరిష్కరించడంలో పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు కూడా నిస్వార్థ సేవ చేస్తున్నారు. వారందరూ మన సమాజంలో ఉన్న ప్రజల యొక్క మద్దతుకు, ప్రశంసలకు, దీవెనలకు అర్హులు.
4. కోవిడ్-19 నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారందరికీ వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండటానికి తగిన రక్షణ పరికరాలు ఇవ్వబడ్డాయి.
5. ప్రాణాలకు తెగించి అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పోలీసులు, ఇతర వృత్తి ప్రదాతలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేసే పోరాటాన్ని బలహీనపరుస్తుంది.
బాధ్యతాయుతమైన పౌరులుగా చేయవలసినవి మరియు చేయకూడనివి ఈ కింద ఇవ్వడం జరిగింది. దయచేసి వీటిని పాటించండి
- కోవిడ్ కు సంబంధించి అవసరమైన సేవలను అందించే వ్యక్తుల ప్రయత్నాలను అభినందించండి మరియు వారికి వారి కుటుంబాలకు మద్దతుగా ఉండండి.
- కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోండి.
- కోవిడ్-19 సంబంధించిన ఏదైనా సమాచారాన్ని సోషల్ మీడియాలో సందేశాల ద్వారా ఫార్వార్డ్ చేసే ముందు ఏదైనా విశ్వసనీయ వర్గాల ద్వారా సరి చూసుకోండి.
- కోవిడ్-19 నుండి కోలుకున్న వ్యక్తులు వైరస్ పై సాధించిన విజయాలను, సానుకూల కథనాలను సమాచార మాధ్యమాల ద్వారా పంచుకోండి.
చేయకూడని పనులు:
- సోషల్ మీడియా మరియు ఇతర మీడియాలో వైరస్ బాధితుల లేదా నిర్బంధంలో (క్వారంటైన్)లో ఉన్న వారి పేర్లు లేదా గుర్తింపును ఎప్పుడూ ప్రచారం చేయవద్దు.
- భయం మరియు భయాందోళనలను కలిగించే అసత్య వార్తలు వ్యాపింప చేయకుండా ఉండండి.
- వీధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్య కార్మికులను లేదా పోలీసులను లక్ష్యంగా చేసుకోవద్దు. మీకు సహాయం చేయడానికే వారు అక్కడ ఉన్నారు.
- కోవిడ్ -19 వ్యాప్తిని ఏ సంఘానికో లేదా ప్రాంతానికో ఆపాదించవద్దు.
- చికిత్సలో ఉన్నవారిని కోవిడ్ బాధితులుగా సంబోధించడం మానుకోండి. అలాగే కోవిడ్ నుండి కోలుకుంటున్న వ్యక్తులను కోలుకుంటున్న వ్యక్తులుగా వారిని సంబోధించండి.