వినాయకుడి ఆకారంలో జన్మించిన శునకం

సోమవారం, 11 అక్టోబరు 2021 (14:27 IST)
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన వెలుగు చూసింది. శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల పుట్టింది. దీంతో స్థానికులు ఈ కుక్కపిల్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ కుక్కపిల్లకు తొండం, పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. దీంతో వాటిని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలవారు భారీగా తరలివస్తున్నారు. ఈ వినాయకుడి ఆకారంలో ఉన్న శునకం.. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నరసయ్య, అన్నవరం దంపతుల ఇంట పుట్టింది. 
 
వీరు గత రెండేళ్లుగా ఓ ఆడకుక్కను పెంచుతున్నారు. ఈ కుక్క ఇటీవలే నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ముందు పుట్టిన మూడు పిల్లలు సాధారణంగా ఉండగా తర్వాత పుట్టిన నాలుగో పిల్ల వినాయకుని ఆకారంలో కనిపించడంతో దంపతులు ఆశ్చర్యపోయారు. 
 
కుక్క పిల్లకు తొండం, పెద్ద చెవులు ఉండటంతో సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట పుట్టాడని యజమాని దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
 
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవడం లేదని.. విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం లేదని దంపతులు పేర్కొన్నారు. దీని కారణంగానే తమ ఇంట వినాయకుడు పుట్టాడని.. పూజలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు