ఏపీలో 13 డ్రగ్‌ డి–అడిక్షన్‌ సెంటర్లు

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (08:03 IST)
ఏపీలోని 13 జిల్లాల్లో డ్రగ్‌ డి–అడిక్షన్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, వైద్య శాఖలు సంయుక్తంగా ఈ కేంద్రాల్ని నెలకొల్పనున్నాయి.

ఈ మేరకు జిల్లా ఆస్పత్రుల్లో డి–అడిక్షన్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
వ్యసనపరుల్ని మద్యం మాన్పించి వారికి చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్, కౌన్సిలర్, నర్సు, అటెండర్లు ఉంటారు.

మెడికల్‌ ఆఫీసరుగా ఓ సైక్రియాటిస్ట్‌ ఆ కేంద్రంలో ఉంటారు. మద్యపానంతో వచ్చే దుష్పరిణామాలు వివరించడంతో పాటు ఆ వ్యసనాన్నుంచి విముక్తి కలిగించేలా కౌన్సెలింగ్‌ ఇస్తారు.

ప్రైవేటు కేంద్రాలకు దీటుగా సేవలు  :
గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలతో చాలామంది మత్తుకు  బానిసలయ్యారు. అప్పటి విధానం మేరకు ఎక్సైజ్‌ సిబ్బంది పనిచేసేవారు. ఇప్పుడు మద్యం వినియోగాన్ని ఎలా తగ్గించాలి? వ్యసనపరుల్ని మద్యానికి ఎలా దూరం చేయాలి? అన్న అంశాలపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది.

తొలుత వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తొలి దశలో జిల్లాకో డి–అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి తర్వాత దశలో విస్తరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికిపైగా ప్రైవేటు, ఎన్జీవోల ఆధ్వర్యంలో డి–అడిక్షన్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రైవేటు కేంద్రాలకు దీటుగా సేవలందించేలా జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయనున్నారు. 
 
కేరళ, పంజాబ్‌ల్లోని డి–అడిక్షన్‌ కేంద్రాలపై అధ్యయనం
కేరళ, పంజాబ్‌లలో అక్కడి ప్రభుత్వాలే భారీగా వెచ్చించి డి–అడిక్షన్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. కేరళలో ‘విముక్తి’ అనే పథకం ద్వారా మద్యం వ్యసనపరులకు కౌన్సిలింగ్, చికిత్సలను డి–అడిక్షన్‌ కేంద్రాల్లో ఇవ్వడానికి అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు.

కేరళలో ఆ సెంటర్ల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అక్కడి విధానాల్ని మన వైద్య, ఎక్సైజ్‌ అధికారులు అధ్యయనం చేశారు. ఏపీలో కూడా మెరుగైన వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు