బెంజిస‌ర్కిల్ పైవంతెన ట్రయల్ రన్ విజయవంతం

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (20:54 IST)
బెంజిసర్కిల్ పైవంతెన విజయవాడ నగర ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ముఖ్యంగా బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. 
 
సోమవారం సాయంత్రం ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ట్రయల్ రన్‌లో భాగంగా అనుమతించడం జరిగిందన్నారు. సోమవారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరు ద్వారకా తిరుమలరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.విద్యాసాగర్‌లతో పాటు విలేఖరుల సమక్షంలో ఫ్లైఓవర్ ట్రయల్ రన్ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ రూ.80 కోట్లతో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మకమైన బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోనికి రానున్నదని, వచ్చే నెలలో కేంద్ర మంత్రివర్యులు చేతులు మీదుగా జాతికి అంకితం చేయడం జరుగుతుందన్నారు.

దశాబ్దాల విజయవాడ ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తున్నామని తద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంద‌న్నారు. బెంజిసర్కిల్ పైవంతెన మొదటివరుస పనులను దిలీప్ బిల్ కాన్ సంస్థకు 2016 నవంబరులో జాతీయ రహదారులు సంస్థ ద్వారా పనులను అప్పగించడం జరిగిందన్నారు.

బెంజిసర్కిల్ పైవంతెన పనులలో సాంకేతిక మైన కారణాలు, డి జైన్ల మార్పు వలన కొద్దిగా ఆలశ్యం అయినా ప్రజలకు పూర్తి స్థాయిలో త్వరలో అందుబాటులోనికి తెస్తున్నామన్నారు. మొత్తం 1470 మీటర్ల పైవంతెన, 880 మీటర్ల అప్రోచ్ రోడ్డుతో వంతెన నిర్మాణంతో 2.35 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.

రెండవ వరుస ఫ్లెఓవర్ నిర్మాణానికి డిపిఆర్ పూర్తైంద‌ని ఆ పనులు కూడా ప్రారంభం అయితే రాబోయే ఏడాది నుంచి రెండేళ్ల సమయంలో రెండవ ఫ్లై ఓవర్ కూడా పూర్తి అవుతుందన్నారు. బెంజిసర్కిల్ పైవంతెన పై విద్యుత్తు దీపాలను త్వరితగతిన అందుబాటులోనికి తీసుకురావాలని ట్రాన్స్‌కో అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 
 
గత 7, 8 నెలలుగా త‌న‌తో పాటు నగర పోలీస్ కమిషనర్  జాతీయ రహదారుల అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పనులు వేగవంత‌మ‌య్యేలా చూడ‌డంతో ట్రయల్ రన్ నిర్వహించుకోగలిగామన్నారు. 

నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ నగరంలోంచి జాతీయ రహదారి మార్గం వెళుతున్నందున విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువుగా ఉందన్నారు. ట్రయల్ రన్ సందర్భంగా చిన్న చిన్న లోపాలను గుర్తించామని వాటి విషయమై సంబంధిత అధికారులకు సూచనలు చేసామన్నారు.

పైవంతెన నుండి దిగే సమయంలో వాలు అధికంగా ఉన్నందున స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చని అందుకు తగిన చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల నిర్మాణాల అధికారులకు సూచించామన్నారు.

రిఫ్లక్టర్లతో కూడిన సూచిక బోర్డులను అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పైవంతెనతో కొంతమేర నగర ట్రాఫిక్ సమస్యను అధిగమించగల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ట్రయల్ రన్ కార్య‌క్ర‌మంలో డిసిపిలు టి.నాగేంద్రకుమార్, వి.హర్షవర్ధనరాజు, ట్రాన్స్‌కో అధికారులు డిఇబివి సుధాకర్, ఏడిఇ ప్రవీణ్‌కుమార్, ఏఇ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు