ఆంధ్రాకు రావాలంటే 'స్పందన'ను సంప్రదించాల్సిందే .. షరతులు వర్తిస్తాయ్!!

సోమవారం, 1 జూన్ 2020 (09:15 IST)
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం లాక్డౌన్ ఆంక్షలను కొనసాగించనున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తమ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా స్పందన యాప్‌లో ఈ-పాస్ పొందాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. అలాగే, అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని తెలిపారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం తీసుకునేంతవరకు షరతులు కొనసాగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరు. 
 
కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. 
 
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉడి, కోవిడ్ టెస్ట్ చేయించుకోవల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వచ్చినట్టయితే కోవిడ్ ఆస్పత్రికి, నెగెటివ్ వచ్చినట్టయితే మరో ఏడు రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్ళవలసి ఉంటుంది. 
 
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు