చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద పట్టుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగులు.. మనంషులపై దాడి చేస్తున్నాయి. పుత్తూరు, వడమాలపేట మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గజరాజులు మంగళవారం నారాయణవనం మండలంలో ప్రవేశించాయి.
ఈ నేపథ్యంలో వీటి దాడులకు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున నారాయణవనం మండలం బొప్పరాజుపాళెం ఎస్టీ కాలనీ ప్రాంతంవైపు ఏనుగుల గుంపు వచ్చింది. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికులు సుబ్బరాయులు, సుబ్రహ్మణ్యంపై ఓ ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
నెలరోజులుగా పుత్తూరు, వడమాలపేట పరిసరప్రాంతాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గజరాజుల దాడులు పెరగడంతో, అటవీశాఖ అధికారులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.