పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్‌కో (హైడల్ ప్రాజెక్ట్స్) చీఫ్ ఇంజినీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని నవయుగ డైరెక్టర్ వై.రమేశ్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఇరువర్గాల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
2021 నవంబరు 20 వరకు తమకు కాంట్రాక్టు గడువు ఉందని వివరించారు. కాంట్రాక్టు రద్దు చేస్తూ ఈ ఏడాది ఆగష్టు 14న ఏపీ జెన్‌కో ఛీఫ్ ఇంజినీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. ప్రాజెక్టు నిర్మాణంలో తమనే కొనసాగించాలని.. రివర్స్ టెండరింగ్‌ను నిలిపివేసేందుకు ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు.