పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌ తప్పనిసరి

గురువారం, 14 నవంబరు 2019 (20:12 IST)
రోజురోజుకీ శర వేగంగా మారుతున్న టెక్నాలజీని అలవర్చుకోవడానికి, ఈ పోటీ ప్రపంచంలో నిలబడడానికి ఇంగ్లిష్‌ తప్పనిసరి అని, అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరో 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఏ స్థాయిలో ఒక్కసారి ఆలోచించాలన్న ఆయన, అప్పుడు రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని, ఆ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కేవలం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం వల్లనే సాధ్యమని వెల్లడించారు. ఆ దిశలోనే విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న ఆయన, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు, వాటిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడిమయ్‌ ప్రవేశపెడుతున్నందుకు తనను ఎందరో టార్గెట్‌ చేస్తున్నారని, అవాకులు, చెవాకులు పేలుతున్నారని, నిశిత విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

అలాంటి వారంతా తమ హిపొక్రసీ వదిలి డెమొక్రసీ విధానంలో ఆలోచించాలని కోరారు. నిరుపేద విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవకూడదా? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయబోనని, ఈ ప్రక్రియలో ముందుకే వెళ్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ విద్యా రంగంలో సమూల మార్పులు సాధించే దిశగా చేపట్టిన ‘మనబడి : నాడు–నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. రూ.10 వేల కోట్ల వ్యయంతో మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేయబోతున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో మూడు దశలలో 9 రకాల సదుపాయాలు కల్పించనున్నారు. తొలి దశలో 15,715 పాఠశాలల్లో ఆ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఎంపిక చేసిన పాఠశాలల్లో 9795  ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు వున్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్ధులు ఉన్న పాఠశాలలను ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కోసం మొదటి దశలో ఎంపిక చేశారు.
 
వీటితో పాటు శిధిలావస్థలో వున్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు, అసంపూర్తిగా వున్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్ధులు వున్న పాఠశాలలకు కూడా మొదటిదశలో అవకాశం కల్పించారు.

418 మండలాల్లో సర్వశిక్ష అభియాన్, 263 మండలాల్లో ఏపీ విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, 49 మండలాల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మొదటిదశలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. 

తాడేపల్లి నుంచి ఒంగోలు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్, తొలుత ‘మనబడి:నాడు–నేడు’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టబోయే మార్పులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

ఆ తర్వాత బాలల దినోత్సవం సందర్భంగా వేదిక వద్ద పండిట్‌ నెహ్రూ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మనబడి : నాడు–నేడు కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. బ్రోచర్‌తో పాటు, పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. 
 
20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఏ స్థాయిలో! 
‘ఈరోజు బాలల దినోత్సవం. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయినా వారి జీవితాలు మార్చాలన్న తపన, తాపత్రయం గతంలో ఏరోజూ కనిపించలేదు. అందుకని ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎవరైనా ఏ జిల్లాలో కానీ, ఎక్కడైనా ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డ 2039 లేదా 2040 తర్వాత డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల తర్వాత పీజీ పూర్తి చేసుకుంటాడు. పెరిగిన తర్వాత ఆ బిడ్డ ఆనాటి సమాజంలో తలెత్తుకుని తిరగడానికి ఏ స్థాయిలో ఉండాలి. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి’.

‘ఇప్పటికే ల్యాండ్‌ ఫోన్లు పోయి అన్నీ స్మార్ట్‌ ఫోన్‌లు. ఎక్కడ చూసినా ఇంటర్నెట్, యాప్స్‌. మరో 10 ఏళ్లలో టెక్నాలజీ ఇంకా ఎంత మారబోతోంది? డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే కార్లు రానున్నాయి. రోబోటిక్స్‌ కీలకం కానున్నాయి. అలాంటప్పుడు మన పిల్లలకు ఇంగ్లిష్‌ రాకపోతే, ఆ భాషలో మాట్లాడలేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.
 
తలరాత అని అలాగే వదిలేద్దామా?
మన రాష్ట్రంలో మనకు ఉన్న సమస్యల గురించి ఒక్కసారి ఆలోచించాలన్న సీఎం వైయస్‌ జగన్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారని గుర్తు చేశారు. అంటే పేదరికం ఏ స్థాయిలో ఉందన్న విషయం అర్ధమవుతోందని అన్నారు. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండి పోవాలా? లేక ప్రపంచంతో పోటీ పడేలా వారి జీవితాలు తీర్చిదిద్దాలా? అన్నది ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం వారికి ఇప్పటి నుంచి అండదండగా నిలబడడమా? లేక వారి తలరాత అంతే అని అలాగే వదిలేయాలా? అని ప్రశ్నించారు.
 
అలా చేయకపోతే తలరాతలు మారవు
ఒక మంచి నిర్ణయం తగిన సమయంలో తీసుకోలేకపోతే తలరాతుల ఎప్పటికీ మారవని, అవి ఎప్పుడూ అలాగే ఉంటాయని సీఎం చెప్పారు. పేదలు ఎక్కువగా చదువుకునే బడుల పరిస్థితి మార్చేందుకు ‘మనబడి: నాడు–నేడు’ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఇది ఒక సవాల్‌ అన్న ఆయన, ఈ తరం పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, పోటీలో నిల్చేందుకు కావాల్సిన చదువులు చదివించాలా? లేదా అని ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు, సినీ నటులు.. ఎవరూ కూడా వారి పిల్లలను తెలుగు మీడియమ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? అన్న ఆయన, మరి పేద పిల్లలను కూడా అలా చదవకుండా వదిలేయాలా? అని అడిగారు.
 
సంస్కృతి అని వదిలేస్తే..! 
పేదవారు తెలుగు మీడియమ్‌లోనే చదవాలని మన సంస్కృతి అంటుంది అని వదిలేస్తే, అదే సంస్కృతి ప్రపంచం ముందు మన స్థాయి చూసి, సిగ్గుతో తల దించుకునేలా చేయదా? ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. అందుకే ఒక్కసారి నిజాయితీతో యోచించాలని, ఈ విద్యా విధానం మార్చాలా?. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలా? అన్న విషయాన్ని ఆలోచించాలని అన్నారు.

‘ఇవాళ మన పిల్లలు కేవలం సమాజంతోనే కాదు, ప్రపంచ జాబ్‌ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు. మరో 10, 20 ఏళ్ల తర్వాత ఈ తెలుగు సమాజంలో ఉన్న పిల్లలు, ప్రపంచంతో పోటీ పడేలా వారిని సిద్ధం చేయాలా? లేదా? అన్నది ఒక్కసారి ఆలోచించండి’ అని సీఎం కోరారు.
 
ఏ ఉద్యోగాలూ రావు
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే, ప్రపంచంతో పోటీ పడలేరన్న ముఖ్యమంత్రి, పేదలు ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లలో చదివే పరిస్థితి లేదని ప్రస్తావించారు. వారిని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో వారికి ఏ ఉద్యోగాలూ రావని, చివరకు డ్రైవర్‌ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని.. అందుకు కారణం డ్రైవర్‌లెస్‌ వాహనాలు వస్తున్నాయని చెప్పారు. 
 
హిపొక్రసీ వదిలి డెమొక్రసీతో ఆలోచించండి
‘అందుకే మన పిల్లలకు మంచి చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే, నన్ను రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. నాపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారంతా ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షితో ఆలోచించండి. నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సినీ నటులు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని అడుగుతున్నాను మీ బిడ్డలు, మీ మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలా? అందుకని హిపోక్రసీని వదిలి డెమొక్రసీగా ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. 
 
మన కళ్ల ముందు ఎందరో ఉన్నారు
. సమాజం బాగు పడాలంటే ఏ ఒక్క వర్గమో కాదని, అందరూ బాగు పడాలని, ముఖ్యంగా పేదలు ఎదగాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు ఉన్న ఉత్తమ మార్గం విద్య అని, మన చదువును దొంగలు ఎత్తుకెళ్లలేరని, అది ఎక్కడికీ పోదని, పిల్లలు బాగా చదువుకుంటేనే ఇంజనీర్‌గా, డాక్టర్‌గా, కలెక్టర్లుగా ఎదుగుతారని చెప్పారు.
 
‘మన కళ్ల ముందే ఉన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఆయన ఐఆర్‌ఎస్‌ అధికారిగా పని చేశారు. ఆయన కూడా 7వ తరగతి వరకు తెలుగు మీడియమ్‌లోనే చదువుకుని, ఆ తర్వాత ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివారు. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్‌ కూడా ఇంటర్‌ వరకు తెలుగు మీడియమ్‌లోనే చదివారు. సీఎం ఆఫీసు కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా తొలుత తెలుగు, ఆ తర్వాత ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివారు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ అవసరాన్ని వారంతా గుర్తించారు’ అని సీఎం వివరించారు.
 
చరిత్రాత్మక నిర్ణయం. ‘మనబడి:నాడు–నేడు’
తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో పేదల కష్టాలు స్వయంగా చూశానని, అందుకే చరిత్రాత్మక నిర్ణయంతో ‘మనబడి:నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని జగన్‌ వెల్లడించారు. ఇది నిజంగా చరిత్రలో నిల్చిపోయే కార్యక్రమం అని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 45 వేల స్కూళ్లు ఉండగా, తొలి ఏడాది 15,715 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఆ స్కూళ్లలో ఇక టాయిలెట్లు, తాగు నీరు, ట్యూబ్‌లైట్లు, క్వాలిటీ ఫర్నీచర్, ప్రహరీలు, గోడల ఫినిషింగ్, పెయింటింగ్, అవసరమైన తరగతి గదులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ల వంటి కనీసం 9 రకాల సదుపాయాలు వస్తాయని చెప్పారు. 
 
ఇంగ్లిష్‌ మీడియమ్‌ 
ప్రతి స్కూల్‌ను ఇంగ్లిష్‌ మీడియమ్‌ చేయబోతున్నామని, అదే విధంగా వాటిలో తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్‌ ఉంటుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్, ఆ తర్వాత ఏడాది 7వ తరగతి.. అలా వచ్చే 4 ఏళ్లలో 10వ తరగతి వరకు మొత్తం ఇంగ్లిష్‌ మీడియమ్‌ ఉంటుందని వెల్లడించారు. 
ఇది తొలుత పిల్లలకు కొంచెం కష్టం కావొచ్చన్న సీఎం, వారికి అందరం  అండగా ఉందామని, ప్రతి స్కూల్‌లో పేరెంట్స్‌ కమిటీలు ఉంటాయని, ఆ కమిటీలు కూడా తమ వంతుగా కృషి చేస్తాయని చెప్పారు. 
 
శిక్షణ–బ్రిడ్జి కోర్సులు
‘1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ అమలులో కొన్ని సవాళ్లు ఉంటాయి. అందువల్ల టీచర్లకు శిక్షణనిస్తాం. పిల్లలకు బ్డిడ్జి కోర్సులు నిర్వహిస్తాము. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి. ఒకటి, రెండేళ్లు కాస్త ఇబ్బంది కావొచ్చు. కానీ 4 ఏళ్లు గడిచే సరికి అన్నీ చక్కబడతాయి. మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో ఐసీఎస్‌ఈ వంటి పరీక్షలు చక్కగా రాయగలుగుతారు’ అని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియలో తనను ఎందరు, ఎలా టార్గెట్‌ చేసినా వెనుకడుగు వేయబోనని, దేవుడి మీద నమ్మకంతో ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
 
ఏటా రూ.3500 కోట్లు
గత ప్రభుత్వం గత ఏడాది స్కూళ్లకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఆ మొత్తంతో 45 వేల స్కూళ్లను ఎలా బాగు చేయగలుగుతారని అన్నారు. ఆ మొత్తంతో ఏం చేయగలమని ఎవరూ ఆలోచించలేదని చెప్పారు.
కానీ తమ ప్రభుత్వం వచ్చాక, ఏటా 15 వేల స్కూళ్లు ఎంపిక చేసుకుని దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, ఆ విధంగా మొత్తం స్కూళ్లు బాగు చేసేందుకు దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. 

మరి ప్రభుత్వం దగ్గర అంత డబ్బుందా? ఒక చిన్నారి అడిగిందని గుర్తు చేసిన సీఎం, మంచి మనసుతో ముందడుగు వేస్తే, పైన దేవుడున్నాడని, ఆయన సహకరిస్తాడన్న నమ్మకం ఉందని చెప్పారు.
 
నాడు–నేడు
‘ఇప్పుడు 15,715 స్కూళ్ల ఫోటోలు తీస్తాము. వాటిని స్కూళ్లలో ప్రదర్శిస్తాము. వాటిని బాగు చేసిన తర్వాత కూడా ఫోటోలు తీసి, రెండింటినీ పోల్చి చూపుతాము. ఇందులో సమస్యలు వస్తాయి. కానీ మీ అందరి చల్లని దీవెనలతో ముందుకు వెళ్తున్నాను’ అని సీఎం వివరించారు.
 
అమ్మ ఒడి
వచ్చే జనవరి 9న ‘అమ్మ ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన ప్రకటించారు. ప్రతి తల్లికి ఒక అన్నగా, తమ్ముడిగా మాట ఇస్తున్నానని, వారు తమ పిల్లలను బడికి పంపిస్తే, ఏటా వారి చేతిలో రూ.15 వేలు పెడతానని చెప్పారు. 
‘మీ పిల్లలను బడికి పంపించండి. బడులన్నీ బాగు చేస్తున్నాము. ఇంగ్లిష్‌ మీడియమ్‌ కూడా ప్రవేశపెడుతున్నాము. కాబట్టి మీరు పిల్లలను బడికి పంపించండి’ అని కోరారు. 
 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌
కళాశాలల్లో కూడా పరిస్థితులు బాగా లేవన్న సీఎం, ఇంటర్‌ తర్వాత డిగ్రీ కోర్సులలో చేరుతున్న వారు చాలా తగ్గుతున్నారని పేర్కొన్నారు. ఇంటర్‌ తర్వాత కేవలం 24 శాతం మాత్రమే డిగ్రీ కోర్సులలో చేరుతున్నారని వెల్లడించారు. అంటే 76 శాతం డ్రాపవుట్లని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఇది దారుణ పరిస్థితి అని చెప్పారు.
ఈ పరిస్థితి మారాలని, పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవాలని, అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. అంతే కాకుండా వారికి హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. 
 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ 
ఇంకా చదువుల్లో కూడా మార్పులు రావాలని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుగుణంగా చదువులు ఉండాలని సీఎం ఆకాంక్షించారు. అందుకే అన్ని కోర్సులలో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ విధానం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని, అలా మొత్తం 25 సెంటర్ల కోసం ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇంకా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఒక చట్టం కూడా చేశామని గుర్తు చేశారు. 
 
4 లక్షల ఉద్యోగాలు
5 ఏళ్లలో జీడీపీ తగ్గుతోందని అందరూ అంటున్నారని, కానీ మన దగ్గర ఈ 5 నెలల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెప్పారు. వాటిలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ, గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని, మరో 2.70 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని, ఈ విధంగా దేశంలో ఎక్కడా జరగలేదని వెల్లడించారు. 
ఇలా అన్ని సంక్షేమ, అభివృద్ధి పనులు చేసే ఈ బాట చాలా కష్టం అన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, తనకు శతృవులు కూడా ఎక్కువే అని, అందుకే ఒక బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరుతూ ప్రసంగం ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు