ఏంటి చంద్రబాబు గారూ, సీఎం జగన్‌కు ఆ టైమివ్వరా?, అందుకే వెళ్తున్నా: వల్లభనేని

గురువారం, 14 నవంబరు 2019 (18:20 IST)
రాజకీయ నాయకులు పార్టీలు మారడం మామూలే. కాకపోతే వెళ్లేటపుడు తాము వెళ్లడానికి కారణాలు చెప్పాలి కదా. కాబట్టి చెప్పేసి వెళ్తుంటారు. ప్రస్తుతం గన్నవరం తెదేపా ఎమ్మెల్యే కూడా అదే పని చేశారు. గతంలో నారా లోకేష్ స్పీచ్‌లో ఎన్నో తప్పులు దొర్లాయి. కాకపోతే అప్పుడు వాళ్ల పార్టీ అధికారంలో వుంది. కనుక, ఆయన నాలుక జారినా అధికారంలో వున్నారు కనుక నెట్టుకొచ్చేశారు. కానీ ఇప్పుడు తెదేపాకి అధికారం పోయింది.
 
వైకాపా భారీ మెజారిటీతో విజయం సాధించింది. కాబట్టి పాలన చేసే పార్టీ వైపు అడుగులు వేయడం చాలామంది ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసే పనే. ఇప్పుడు అదే పని వల్లభనేని వంశీ కూడా చేసేస్తున్నారని చాలామంది చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ అప్పుడెప్పుడో టంగ్ స్లిప్ అవుతూ చేసిన జయంతికి బదులు వర్థంతి మాట, ఇప్పుడు వల్లభనేని వంశీకి ఉపయోగపడింది. అదే పార్టీ మారడానికి.
 
ఐతే ఇది ఒక్కటే కారణం కాదులెండి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు చాలా బాగా నచ్చాయంటూ చెప్పారు వల్లభనేని. పైగా ఏడాది కాలం కూడా పాలన పూర్తి కాని ప్రభుత్వంపైన తప్పులు వెదకడం, దీక్షలు చేయడం లాంటివి చంద్రబాబు చేయడం వల్లభనేనికి అస్సలు నచ్చడం లేదట. అందువల్ల ఇక తెదేపాలో వుండటం తనకు ఇష్టం లేదనీ, అందువల్ల పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు