పేరు మార్చుకున్నాక కాపుల గురించి, పవన్ గురించి ఆయనకెందుకు?

సెల్వి

శనివారం, 22 జూన్ 2024 (16:08 IST)
ఈ ఏడాది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాజీ ఎంపీ, కాపు నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
 
అయితే పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో ముద్రగడ సవాల్‌‌లో ఓడిపోయారు. సవాల్‌లో ఓడిపోవడంతో ముద్రగడ అధికారికంగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. కాగా, ముద్రగడ తన పేరు మార్చుకున్నా.. ఆయన వైఖరి మాత్రం మారలేదని ఆయన కుమార్తె క్రాంతి ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అంటూ క్రాంతి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
 
పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు.
 
శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు