మున్ముందు కరోనా సోకని వ్యక్తంటూ ఉండరు : సీఎం జగన్

గురువారం, 16 జులై 2020 (16:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కరోనా సోకని వ్యక్తంటూ ఉండబోరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి శరవేగంగాసాగుతోంది. 
 
ఫలితంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 38,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 492 మంది మరణించారు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చని జగన్ అన్నారు. కరోనా సోకినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే 85 శాతం ఇంటివద్దే కోలుకోవచ్చని చెప్పారు. 
 
పొరుగున ఉన్న రాష్ట్రాలు సరిహద్దులను తెరిచి ఉంచాయని, ఎవరి రాకపోకలనూ మనం కట్టడి చేయలేమని... ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పారు.
 
ఇదిలావుంటే, ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మరింత తీవ్రమైంది. గత కొన్నిరోజులుగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రమాదకర వైరస్ బారినపడి 40 మంది మృత్యువాత పడ్డారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 492కి పెరిగింది.
 
తాజాగా, 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590, తూర్పు గోదావరి జిల్లాలో 500 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కి చేరింది. 943 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 18,159 మంది చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు