ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతుడైన మాజీ నక్సలైట్ నయీం ఆగడాల కేసులో రాజకీయ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీంకు చెందిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా అనేక ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇందులోభాగంగా, నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి నయీంకు పూర్తి స్థాయిలో అండదండలు అందించినట్లు అధికార వర్గాలు ప్రచారంలో పెట్టాయి. మాజీ మంత్రి నీడలోనే నయీం ఎదిగాడని, వారింట్లోనే చాలా కాలం ఆశ్రయం పొందాడని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
నయీం ఫోన్ కాల్స్‌ను దర్యాప్తు అధికారులు పరిశీలించారని, వాటిలో సదరు మాజీ మంత్రి నుంచి వచ్చినవే ఎక్కువ ఉన్నాయని గుర్తించారని చెబుతున్నాయి. నయీం అనుచరుల్లో కొంతమంది ఆ మాజీ మంత్రి అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు మాజీ మంత్రిని ఏ1గా నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఆ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతగా తెరాస శ్రేణులు పేర్కొంటున్నారు.