3 కోట్ల నకిలీ నోట్లు.. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడుల్లో మార్చేద్దామనుకున్నారు.. కానీ?

బుధవారం, 24 జులై 2019 (20:51 IST)
గుట్టుచప్పుడు కాకుండా దొంగ నోట్లను తయారుచేస్తూ చలామణి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ముఠాను కుప్పం పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసే రెండు కోట్ల 72 లక్షల 22 వేల రూపాయలను స్వాధీనం చేసుకొని దొంగ నోట్ల తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు ప్రజల్లోకి వెళ్లే మునుపే పోలీసులు ముఠా సభ్యులను పట్టుకోవడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దొంగ నోట్ల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే మోసపోకుండా ఉండవచ్చన్నారు.
 
చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం మండలం సామగుట్టపల్లి గ్రామంలోని అనంత కుమార్ ఇంటిలో ఈ దొంగనోట్లను ముద్రించి విక్రయిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం బరుగూరు తాలూకా కె నగర్ చెందిన కె. మణికంఠన్, క్రిష్ణగిరి తాలూకా ఎల్తిగిరి గ్రామానికి చెందిన కుబేంద్రన్, కుప్పం మండలం సామగుట్టపల్లికి చెందిన అనంత కుమార్, బురుగూరు తాలూకా కె.నగర్‌కు చెందిన సురేష్ కుమార్, తిరుపతి విద్యానగర్‌కు చెందిన దేవి రెడ్డి సురేష్ రెడ్డి, తిరుపతి అంబేద్కర్ కాలనీకి చెందిన హేమంత్ కుమార్‌లు ఒక ముఠాగా ఏర్పడి దొంగ నోట్లు ముద్రించి చలామణికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజలాపురం గ్రామంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
 
నిందితుల వద్ద నుండి దొంగనోట్ల ముద్రణకి ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, స్కానర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు