రాజస్థాన్‌కు చెందిన ఎస్ భరత్‌కుమార్ రెండు దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో రూపాలి గిఫ్ట్స్, నావెల్టీస్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. చిన్న కుమార్తె బెంగుళూరులో ఆర్కిటెక్ కోర్సు చదువుతోంది.
ఈ క్రమంలోనే బెంగాలీకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి ప్రేమ పెళ్లికి దారితీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. దసరా పండుగకు ఆ యువతి అనంతపురానికి వచ్చింది. పండుగ ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం తిరిగి బెంగళూరుకు వెళ్తూ.... ప్రేమ వివాహం చేసుకున్న విషయాన్ని తండ్రి భరత్ కుమార్‌కు ఫోన్ ద్వారా చెప్పింది.
పైగా, తన కోసం ఎక్కడా వెతకవద్దు... ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తితో వెళ్లిపోతున్న అంటూ ఫోను సందేశంలో తెలిపింది. దీంతో ఒక్కసారిగా భరత్‌కుమార్ నిర్ఘాంతపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో భరత్‌కు గుండె ఆగినంతపనైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుమార్తె చర్యను జీర్ణించుకోలేని భరత్ కుమార్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.