నంద్యాల: ర్యాగింగ్ రక్కసి ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలను వీడలేదు. అందమైన అమ్మాయి కాలేజీకి వస్తే... ఆకతాయిలు ర్యాగింగ్ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఉష దీనికి బలిపశువు అయింది. నంద్యాల ఆర్.జి.ఎం. కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఉష ఆత్మహత్యకు పాల్పడింది. కొన్నాళ్లుగా ఆమెను కాలేజీలో కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు.
అది విషమించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. నంద్యాల నుంచి స్వగ్రామానికి బద్వేలు బయలుదేరి, మార్గమధ్యమంలోనే పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉషను వెంటనే కడప ఆసుపత్రికి తరలించారు. ఆయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.
ఎంతో అందంగా ఉండే ఉషపై మొదటి నుంచి అందరి కళ్ళూ ఉండేవి. ఐటీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న ఉషపై సీనియర్లందరూ వెంటపడి ర్యాగింగ్ చేసేవారట. కొంతకాలంగా ర్యాగింగ్‌ను భరిస్తూ వస్తున్న ఉష.. ఇక భరించలేని స్థితికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రతిరోజూ స్నేహితులతో తన ఆవేదనను చెప్పుకునేదని సమాచారం. చివరకు ప్రాణత్యాగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అన్నిటికీ మించి ఉష ఓ ప్రజాప్రతినిధికి చెల్లెలు. బద్వేలు జడ్పీటీసీగా ఉన్న శిరీషకు ఉష స్వయానా చెల్లెలు. ఓ ప్రజాప్రతినిధి చెల్లెలికే కాలేజీల్లో రక్షణ లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అమ్మాయిలు, తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.