లాక్‌డౌన్, చేపల వేటపై నిషేదం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.
20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
గత నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వేట విరామ సాయం గైడ్‌లైన్స్...
- మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- మరపడవలపై 8 మంది, మోటర్ పడవలపై 6గురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం
- గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది...పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు
- లబ్ధిదారుల జాబితా ఖరారు అయిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది
ఈ ఏడాది వేట విరామ సమయం ప్రారంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం చేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అంతేకాక అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు ప్రారంభించారని, వారి అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నట్లు ఆ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు.