ముంచుతున్న వ‌ర‌ద‌లు, జ‌ల‌మ‌య‌మైన ర‌హ‌దారులు

శుక్రవారం, 23 జులై 2021 (11:35 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్లో గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో చిన్న చిన్న వాగులు పొంగి వ‌ర‌ద‌లు ముంచుతున్నాయి. ర‌హదారులు జ‌ల‌మ‌య‌మై తెలంగాణాకు రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది.
 
గ‌త రెండు రోజులుగా కురిసిన భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగి గ్రామీణ ప్రాంతాల్లో ర‌వాణాకు ఆటంకం క‌లుగుతోంది. ముఖ్యంగా ఏరులు పొంగి ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ, జ‌గ్గ‌య‌పేట మండ‌లాల్లో ప‌లుచోట్ల ర‌హ‌దారుల‌పైకి నీరు చేరి, తెలంగాణా ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అయ్యాయి. నందిగామ స‌బ్ డివిజ‌న్లో వీరులపాడు మండలం పల్లంపల్లి వద్ద వైరా -కట్టలేరు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. దీనితో వీరులపాడు - నందిగామ మండలాల మధ్య రాక‌పోక‌లు నిలిచిపోతున్నాయి.
 
కూడలి దాములూరు వ‌ద్ద‌ వైరా- క‌ట్లేరు న‌దిపై నిర్మించిన బ్రిడ్జి అసంపూర్తిగా ఉండ‌టం వ‌ల్ల ఏటా ఇదే స‌మ‌స్య వ‌స్తోంది. చ‌ప్టాపైకి నీరు వచ్చి రాక‌పోక‌లు నిలిచిపోతున్నాయ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చ‌నాపాలెంలో ఏనుగువాగు వ‌ద్ద ఇదే స‌మ‌స్య‌.

ఇలాంటి చోట చిన్న చిన్న‌వంతెన‌లు నిర్మించాల‌ని, కూడ‌లి బ్రిడ్జి వ‌ద్ద చిన్న అప్రోచ్ రోడ్డు నిర్మించాల‌ని కోరుతున్నారు. ర‌హ‌దారులే కాదు... పంట‌లు మునిగి రైతులు న‌ష్ట‌పోతున్నారు. ఇప్ప‌టికే తాము ఎక‌రాకు 30 వేల రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్టి వేసిన పంటలు నీట మునిగాయ‌ని రైతులు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు