ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ జివి రెడ్డి ప్రశంసలు కురిపించారు. కనీస ఆదాయ లోటుతో చక్కగా ప్రణాళికాబద్ధమైన వార్షిక బడ్జెట్‌ను సమర్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆయన ప్రశంసించారు. కేవలం రూ.33,000 కోట్ల ఆదాయ లోటుతో దీనిని రూపొందించారని ఆయన హైలైట్ చేశారు.
ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కనీస ఆదాయ లోటును కేవలం రూ.33,000 కోట్లకు పరిమితం చేస్తూ మొత్తం రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను నిర్ణయించారు. "నా వృత్తిపై దృష్టి పెట్టడానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకున్న గౌరవం, అభిమానం మారలేదు" అని జివి రెడ్డి పేర్కొన్నారు.
తన పదవీకాలంలో తనకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినందుకు తెలుగుదేశం పార్టీకి (టిడిపి) ఆయన కృతజ్ఞతలు తెలిపారు. "నా పదవీకాలం తక్కువగా ఉన్నప్పటికీ, నాకు టిడిపిలో, ప్రభుత్వ వ్యవస్థలో గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు.
ఈ అవకాశం ఇచ్చినందుకు మన నాయకుడు చంద్రబాబు నాయుడుకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రగతి కొనసాగాలంటే, ప్రజల సంక్షేమం కోసం, మన నాయకుడు 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అభివృద్ధిని కోరుకునే ప్రతి తెలుగు వ్యక్తి ఆయనకు మద్దతు ఇవ్వడం విధి" అని అన్నారు.
ఇటీవల, వ్యక్తిగత కారణాల వల్ల జివి రెడ్డి ఎపి ఫైబర్ నెట్ చైర్మన్, టిడిపి ప్రాథమిక సభ్యత్వం, టిడిపి జాతీయ ప్రతినిధి పదవులకు రాజీనామా చేశారు.