ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు పంపించారు.
ఈ సందర్భంగా ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఆయన చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,566 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. వెంకటరెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు.
మరోవైపు వెంకట రెడ్డి తరపు న్యాయవాది రిమాండు విధించవద్దని వాదించారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు.. వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో అధికారులు ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. ఇక వెంకటరెడ్డిని కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.