క్షణికావేశంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతూ వందేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు విద్యార్థులు. ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక తల్లి ఎదుర్కొంది. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని కురబల ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంతోష్ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి రత్నమ్మ కుమారుడిని కష్టపడి చదివించుకుంటోంది.
కూలి పని చేస్తూ రత్నమ్మ కుమారుడిని ప్రైవేట్ కళాశాలలో చదివించుకుంటోంది. అయితే గత నెలరోజులుగా సహచర విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్ ఉండటంతో సంతోష్ తల్లి రత్నమ్మను ఫోన్ తీసివ్వమని కోరాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని తరువాత తీసిస్తానని కుమారుడికి నచ్చజెప్పింది తల్లి. అయితే మంగళవారం తల్లితో గొడవపడిన సంతోష్ సెల్‌ఫోన్ తీసివ్వాలంటూ భీష్మించుకు కూర్చున్నాడు.
అయితే తల్లి ఎప్పటిలాగే చెప్పడంతో కళాశాలకు వెళ్లనని ఇంటిలోనే ఉండిపోయాడు సంతోష్. తల్లి రత్నమ్మ కూలి పని నిమిత్తం బయటకు వెళ్ళిపోయాడు. అయితే కొద్దిసేపటికే కుమారుడు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం రత్నమ్మకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో రత్నమ్మ బోరున విలపిస్తూ ఇంటికి చేరుకుంది. కుమారుడిని విగతజీవిగా చూసిన రత్నమ్మ గుండెలు పగిలేలా ఏడవడం చూసిన స్థానికులు కళ్లు చల్లగియ్యాయి.