తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగులకు ఉచిత వైద్యం, మెడికల్ కిట్లు.. పొందడం ఎలా?
శనివారం, 29 ఆగస్టు 2020 (09:37 IST)
కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఉచితంగా వైద్య సేవలను అందించడమే కాకుండా, వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్న డాక్టర్ అమ్మన్న నేతృత్వంలోని వైద్య బృందం తమ సేవలను మరింత విస్తరించింది.
ఇప్పటివరకు దాదాపు 1600 మందికి ఉచితంగా మెడికల్ కిట్లు అందించి కోవిడ్-19 రోగులకు అండగా నిలిచిన డాక్టర్ అమ్మన్న బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సేవలందించేందుకు సమాయత్తమైంది.
కోవిడ్-19 రోగులకు కనీస వైద్యసాయం అందించేందుకు సైతం ఎవరూ ముందుకురాని తరుణంలో.. వారికి వైద్య సహాయంతో పాటు ఉచితంగా మందులను అందించేందుకు అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ నలమాటి అమ్మన్న స్వచ్చంధంగా ముందుకువచ్చారు.
సిద్దార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు, ఏపీ సొసైటీ ఆఫ్ నెఫ్రాలాజిస్ట్స్ సభ్యుల సహకారంతో వివిధ ప్రాంతాల్లోని కరోనా బాధితులకు మెడికల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నారు. కోవిడ్-19 విస్తృతి దృష్ట్యా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత సేవలను అందించాలని నిర్ణయించినట్లు డాక్టర్ అమ్మన్న తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, తూర్పుగోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అన్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య పరిస్థితిని బట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే సులువుగా కోలుకోవచ్చని వివరించారు.
తాము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ల ద్వారా కోవిడ్-19 రోగుల మెడికల్ రిపోర్టులను పరిశీలించి వైద్య సేవలందిస్తున్నామని, పాజిటివ్ వ్యక్తులకు అవసరమైన మెడికల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు.
విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న తమ బృందం సేవలను చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కరోనా బాధితులు వినియోగించుకుంటున్నారని, ఇప్పటివరకు ఉచితంగా 1600 మందికి అవసరమైన వైద్య కిట్లు అందజేశామని చెప్పారు.
నిత్యం రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ, వారు ఏయే మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై సూచనలు, సలహాలు ఇస్తున్నామని అన్నారు. పాజిటివ్ వ్యక్తులు అనుసరించాల్సిన అంశాలను పొందుపరచిన ప్రత్యేక బుక్‌లెట్‌ను రోగులకు అందజేస్తున్నామని చెప్పారు.
పాజిటివ్ వచ్చిన బాధితులకు సేవలందించేందుకు 9063921413, 9063931413, 9063981413 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచామని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్-19 బాధితులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
విజయవాడ కేంద్రంగా డాక్టర్ భారతి, డాక్టర్ ధనుంజయ్, డాక్టర్ ఉజ్వల, డాక్టర్ నేహ, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రోహిత్, తిరుపతిలో డాక్టర్ హితేశ్వరి, గుంటూరులో డాక్టర్ శివరామకృష్ణ, రాజమండ్రిలో డాక్టర్ రవిశంకర్, విశాఖలో డాక్టర్ నరసింహరాజు, మాధిరలో డాక్టర్ సతీష్ లతో పాటు వివిధ ప్రాంతాల్లోని వైద్య నిపుణులు తమ హెల్ప్‌లైన్ ద్వారా కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్నారని తెలిపారు.
తమ వద్ద వైద్య సహాయం పొందిన వారిలో విజయవాడ నుండి నలుగురు, గుంటూరు నుండి ఇద్దరు వ్యక్తులు ప్లాస్మా దానం చేశారని వెల్లడించారు. కరోనా నుండి కోలుకుని ప్లాస్మా దానం చేయదలుచుకున్న వారు గానీ, కోవిడ్-19 చికిత్స నిమిత్తం ప్లాస్మా కావాల్సిన వారు గానీ తమ హెల్ప్‌లైన్ ను సంప్రదించాలని డాక్టర్ అమ్మన్న కోరారు.