అర్జీ ఇవ్వడానికి వెళ్ళడం దండయాత్రా..!?: జోగి రమేష్

శనివారం, 18 సెప్టెంబరు 2021 (13:19 IST)
చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకు వెళ్తున్నానంటూ ప్రకటనలు గుప్పించి, అక్కడ రసాభాస తో  అందరి నోళ్ళల్లో నానిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ నాలుక మడతబెట్టారు. అర్జీ ఇవ్వడానికి వెళ్ళడం దండయాత్రా..!? అంటూ మీడియానే ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
1- తెలుగుదేశం పార్టీ తాబేదారు పత్రికలు, కొన్ని పచ్చ పత్రికలు కూడబలుక్కుని ఒకదగ్గర చేరి, ఏమి హెడ్డింగ్‌లు పెట్టాలి, ఏమి రాయాలి అని మక్కీకి మక్కీ ‘చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అని హెడ్డింగ్‌లతో ఆయనకు వత్తాసు పలికేలా రాశారు. ఈనాడులో చూస్తే చంద్రబాబు ఇంటిపైకి దండయాత్ర, అదే హెడ్డింగ్‌ను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగారు కూడా వాడారు. కూడబలుక్కుని రాయడం అంత అవసరమా? కనీసం పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లేదు.

మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం పచ్చ పత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారు.
 
2-రాజకీయ చరిత్రలో 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, చలించిపోయి అధికారంలోకి వచ్చాక వారికి అన్నివిధాలా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని అయిదున్నర కోట్లమంది ప్రజలే కాకుండా యావత్‌ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ఎక్కడున్నా కానీ  గౌరవిస్తుంటారు.

ప్రజలంతా మెచ్చుకునే విధంగా పాలన చేస్తుంటే జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని అయ్యన్నపాత్రుడు వ్యక్తిగతంగా అమ్మనా బూతులు తిడుతూ, మహిళ అయిన హోంమంత్రిని బండ బూతులు తిడుతూ పత్రికల్లో రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా వారి మాటలు ఉన్నాయి. చంద్రబాబు స్క్రిప్ట్‌ రాసిస్తే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు.

ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద, నివాసం వద్ద నిరసన తెలియచేయడానికి విన్నపం, విజ్ఞాపన ఇవ్వాలని వెళితే నా కారుమీద రాళ్లు వేశారు. కారు దిగకముందే కారు అద్దాలు పగులగొట్టారు. టీడీపీ గుండాలు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన నామీద దాడి చేశారు.
 
3-నేను దండయాత్ర చేయడానికి వెళ్లానా? విన్నపం, విజ్ఞాపన ఇవ్వడానికి వెళ్లానా? గూండాలు, రౌడీలతో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్లగాళ్లను చంద్రబాబుగారు కరకట్టలోని తన నివాసం వద్ద పెట్టుకుని నాపై దాడి చేయించారు. బుద్ధా వెంకన్నలాంటి కాల్‌మనీ సెక్స్‌ రాకెట్ గాళ్లని,  పట్టాభి లాంటి పందికొక్కులను, గన్నే నారాయణప్రసాద్‌ లాంటి రౌడీ షీటర్లను గద్దె రామ్మోహన్‌, మీరావలీ, నాగూల్‌ మీరా, బ్రహ్మంలాంటి వాళ్లను పెట్టుకుని రాళ్లతో దాడి చేయించారు. జరుగుతున్న పరిస్థితులను అన్ని టీవీ ఛానల్స్‌ చూపించాయి..
 
4-ముఖ్యమంత్రిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఒక పౌరుడిగా, బాధ్యతగల వ్యక్తిగా నిరసన తెలియచేయడానికి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుగారి దగ్గరకు వెళితే నాపై రాళ్లు వేయించాడు, కారు పగులకొట్టించాడు, కారు దిగకముందే నాపై దాడికి ప్రయత్నించారు, ఇన్నివిధాలుగా మీరు రచ్చ చేసి... మాపై నిందలా? మీది దండయాత్రా? నాది దండయాత్రా? మీ పచ్చ పత్రికలు హెడ్డింగ్‌లు పెట్టాయే? మీ ఇంటి మీదకు నేను దండయాత్రకు వచ్చానా? మీ ఇంటి దగ్గరకు వచ్చింది నిరసన తెలియచేయడానికే, దండయాత్రకు కాదు.
 
5- గూండాలను తెచ్చింది, పంపించిందీ చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రిగారికి అర్జీ ఇవ్వడానికి నిరసన తెలియచేయడానికి వెళతాం. మీరు ఎన్నిసార్లు చేయలేదు నిరసన. సీఎం నివాసం, సచివాలయం "ముట్టడి" కార్యక్రమం చేస్తూ ఉంటారు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు?

మీరు ముట్టడికి వెళ్లినప్పుడు వైయస్సార్‌ పార్టీ తరపును మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ప్రతిఘటించామా? మీపై దౌర్జన్యం చేసి కొట్టామా? వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు? నన్ను కూడా మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ వరకూ తీసుకు వెళ్లారు. నిరసన తెలియచేయడానికి వెళితే నామీద, మా కార్యకర్తలపై దాడి చేస్తారా? 
 
6-ఇంత దుర్మార్గంగా చంద్రబాబు వ్యవహరిస్తూ.. మళ్లీ మాపై ఎదురుదాడి చేస్తారా? మీకు కొంచమైనా మానవత్వం అనేది ఉందా? 40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, అయ్యన్నపాత్రుడిని ఆరకంగా ప్రేరేపిస్తూ సమాజంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తే, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి అరాచకాలు పన్నేందుకు విషం కక్కుతున్న మీ భయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.

చంద్రబాబుగారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ముఖ్యమంత్రిగారికి అర్జీ ఇస్తారు. ప్రతిపక్ష నేతకు అర్జీ ఇస్తారు. అదేవిధంగా మీ దగ్గరకు వచ్చాను. నిరసన తెలియచేయడానికి వచ్చాను. మరి నా అర్జీని తీసుకుంటే సరిపోయేది కదా? పిరికిపందలా ఇంట్లో కూర్చున్నారే. 
 
7-దీన్ని కూడా టీడీపీ నాయకులు జీర్జించుకోలేకపోయారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నాపై దాడి చేయాలని చూశారు. నాతో వచ్చినవాళ్లను కొట్టారు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మీ పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై దాడికి, దండయాత్రకు వెళ్లామని రాస్తారా? దాడి చేయించిందే చంద్రబాబు. దాడికి ప్రేరేపించేందే బాబుగారు.

మళ్లీ దొంగే దొంగలా నిందలు వేసే కార్యక్రమం చేస్తే ఎలా?ఇప్పటికైనా చంద్రబాబులో పరివర్తన రావాలి. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మీరు మాట్లాడించిన మాటలుపై సమాధానం చెప్పాలి. సభ్యసమాజం తలదించుకునేలా అయ్యన్న మాటలు ఉన్నాయి.
 
8-ప్రతిపక్షపాత్ర...పనికిమాలిన పాత్రగా తయారైంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.అమ్మ ఒడి పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయారు వారికి కూడా ఇవ్వమని అడగండి. రైతు భరోసా, ఇళ్ల స్థలాలు ఎవరైనా తీసుకోని వాళ్లకు ఇవ్వమని అడగండి. అంతేకానీ ఈవిధంగా బూతుల పురాణానికి లంకించుకున్న మీరు అన్నం తింటున్నారా? లేక మీరు తినేది విషమా? అ‍య్యన్నపాత్రుడు మళ్లీ ఇంకా వల్గర్‌ భాషలో మాట్లాడారు?
 
9-రెచ్చగొట్టే కార‍్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో మీ గూబ గుయ్యమనేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. చంద్రబాబుకు హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యమంత్రిగారిని ఉద్దేశించి మాట్లాడే భాషను మార్చుకోకపోతే రాష్ట్రంలో నిరసన తెలుపుతాం. చంద్రబాబు గారు ఎక్కడ పర్యటిస్తే, అక్కడ నిరసన తెలుపుతూ.. ఆయన వెంటపడుతూనే ఉంటాం.

అయ్యన్నపాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? లేక బాగా బూతులు తిట్టరాని మీరు జాతీయ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి అయ్యన్నకు కట్టబెడతారో.. అది మీ ఇష్టం. వ్యక్తిగత దూషణలు జరిగేతే మాత్రం నిన్న జరిగింది ఆరంభం మాత్రమే అని చెబుతున్నాం.. ఇప్పటికైనా మీ భాషను సరిచేసుకోండి బాబూ. 
 
10-ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చిచ్చుపెట్టాలనో, ముఖ్యమంత్రిపై బురద చల్లేందుకు యత్నించడం సరికాదు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారి గురించి లోకజ్ఞానం తెలియని లోకేష్‌ మాట్లాడటమా? మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించినా.. బుద్ధిరాలేదా? ఇంకా ఏం చూసుకుని తొడగొడతావు లోకేష్‌. మీ మామ, మీ అయ్య తొడలు కొట్టి పోయారు.. నువ్వు తొడగొట్టి ఏం చేస్తావు లోకష్‌. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు. రాసిపెట్టుకో ఈ విషయాన్ని.  కారు ఎక్కేసి తొడలు కొట్టడం .. మీసాలు తిప్పడం... ఇవేమీ సినిమాలు కావు. 
 
11-రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ పారిపోయిన తండ్రీకొడుకులకు ఇక్కడ ఇల్లు, ఆధార్‌ కార్డు, అడ్రస్‌ లేదు. ప్రజా సమస్యలపై పోరాడితే బాగుటుంది కానీ, ప్రతిపక్షంలో ఉండి చెత్త రాజకీయాలు చేయడం కాదు. వైఎస్‌ జగన్‌గారు పాదయాత్రలో రైతులు, పేదలు, సామాన్య ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూశారు కాబట్టే.. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కరోనా సమయంలో కూడా నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నారు.

రైతులకు రైతు భరోసా కింద నగదు, అమ్మ ఒడి, ఆసరా, చేయూత పధకం ద్వారా అందరికీ సాయం చేస్తూ బాసటగా నిలిచారు. మీకు ఇలాంటి ఆలోచన మీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా కలిగిందా? మీ నీచమైన చరిత్రను ప్రజలు గమనిస్తున్నారు.
 
12-ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. రేపు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 97శాతం పైగా స్థానాలు వైయస్సార్‌ సీపీ కైవసం చేసుకుని, చరిత్ర పుటల్లో మిగలిపోతుంది. రెచ్చగొట్టేలా మాట్లాడే అయ్యన్న లాంటివాళ్లను తరిమితరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేమూ గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళతాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు