అంగవైకల్యం 80 శాతం దాటితే ఒకే కుటుంబంలో రెండో పింఛన్

ఆదివారం, 15 డిశెంబరు 2019 (15:46 IST)
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో రెండో వ్యక్తి లేదా మహిళకు కూడా పింఛన్‌ మంజూరు చేసేందుకు అనుమతి తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక పింఛను విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళతరం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. 
 
80 శాతం కంటే అంగ వైకల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి పింఛన్‌ మంజూరుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. 
 
కిడ్నీ రోగులు, తీతీవ్రమైన మానసిక వ్యాధితో బాధ పడేవారు, ఎయిడ్స్‌ రోగుల విషయంలో కూడా అదే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పింఛన్‌ మంజూరుకు వీలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. 
 
పింఛన్‌ మంజూరుకు కుటుంబ ఆదాయంతో పాటు పలు అర్హత ప్రమాణాలలో మినహాయింపు ఇస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు నిబంధనలలో మార్పులు చేసింది.
 
పింఛన్‌ నిబంధనలు ఇవీ.. గ్రామీణ ప్రాంతంలో నెలకు గరిష్టంగా రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 ఆదాయం ఉన్నా కూడా పింఛన్‌ పొందేందుకు అర్హులు.
 
గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి, లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ పింఛన్‌ పొందేందుకు అర్హత ఉంటుంది.
 
 రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉంటే కూడా అర్హులే. ప్రస్తుతం వృద్ధాప్య, చేనేత, దివ్యాంగ, మత్స్యకార, కల్లుగీత కేటగిరీల్లో పింఛన్‌ పొందుతున్న వ్యక్తి చనిపోతే, వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్‌ మంజూరు చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు