ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరగ్గా... దాదాపు 20 నిమిషాలకుపైగా ఏపీ ప్యాకేజీపైనే ప్రధాని, గవర్నర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కూడా వారి చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.
అభివృద్ధి కావాలనుకున్న వాళ్లు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యలను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్న వారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీకి ప్యాకేజీని ప్రకటించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలూ ఎదురుకావనే భావిస్తున్నామని, ప్యాకేజీ వల్ల అభివృద్ధి పథంలో ఏపీ దూసుకుపోవడం ఖాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు.