ఏపీ ప్రజలను దగా చేసిన బీజేపీ : గులాం నబీ ఆజాద్

మంగళవారం, 24 జులై 2018 (17:17 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దగా చేసిందని కాంగ్రెస్ రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. మంగళవారం రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో గులాం నబీ ఆజాద్ పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్ర విభజన చరిత్ర తెలిస్తేనే ఏపీ సమస్యలేంటో తెలుస్తాయన్నారు.
 
ఏపీ ప్రజల మనోభావాలు తనకు తెలుసునని, ఆంధ్రప్రదేశ్‌తో తనకెంతో అనుబంధం ఉందన్నారు. తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని, ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో.. అలాగే ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం అంతే సమంజసమన్నారు. 
 
ముఖ్యంగా, విభజన సమయంలో హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ నేతలే అన్నారని చెప్పారు. ఏపీ ప్రజల సమస్యను సానుభూతితో చూడాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అన్నదని, ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ.400 కోట్లే ఇచ్చిందని అజాద్ ఆరోపించారు. 
 
పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట తప్పారని ఆయన విమర్శించారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్లాంట్ ఆచూకీ లేదని ఆజాద్‌ అన్నారు. సుప్రీంకోర్టులో మాత్రం విభజన హామీలన్నీ నెరవేర్చామని కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఈ ప్రభుత్వం దేశాన్ని, పార్లమెంట్‌ను, ఏపీని మోసం చేస్తోందని ఆజాద్ దుయ్యబట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు