తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఈనెల 7వ తేదీన ప్రమాణం చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. 7వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అన్నా డీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. అలాగే, ప్రమాణ స్వీకార తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
పన్నీర్ సెల్వం మంత్రి వర్గంలోని చాలా మందికి ఉద్వాసన పలుకుతారని, భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థాన చలనం కలుగుతుందని తెలుస్తోంది. అదేవిధంగా, అన్నాడీఎంకే పార్టీలోని అసంతృప్తులను శశికళ బుజ్జగించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాగా, తమిళనాడు సీఎంగా తానే కొనసాగాలని భావించిన పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ఒక వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఈ ప్రయత్నాలు శశికళకు నచ్చకపోవడం తెలిసిందే.
అంతకుముందు.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం తొలుత ప్రదిపాదించగా, మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన విషయాన్ని శశికళకు పన్నీర్ తెలియజేశారు.