1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో బి.సరోజా దేవి జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ దాన్ని ఆమె వద్దనుకున్నారు. తర్వాత 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన కన్నడ మూవీ మహాకవి కాళిదాసుతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత 1957లో పాండురంగ మహాత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
సుమారు 180 చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఎన్నో సూపర్‌హిట్లు అందుకున్నారు. తెలుగులో పాండురంగ మహత్యం, భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మ బలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శకుంతల, రహస్యం, భాగ్యచక్రం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు.