తిరుమల తిరుప‌తిలో కుండపోత వర్షం... భ‌క్తులు లేని ఆవ‌ర‌ణ‌

సోమవారం, 1 నవంబరు 2021 (16:03 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవగా, నెల్లూరు, తిరుమలలో కుండపోతగా కురిశాయి. నెల్లూరులో గంటపాటు ఆగకుండా వానపడటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నగరంలోని నర్తకి, కనకమహల్, గాంధీబొమ్మ, వీ ఆర్ సి, ముత్తుకూరు బస్టాండ్, హరనాథపురం సెంటర్లలో రోడ్లపైకి వర్షపు నీరు వచ్చేయటంతో పాదచారులు, వాహన చోదకులు అవస్థలు పడ్డారు. అయితే, ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడి పోతున్న జనం వర్షాలతో వాతావరణం చల్లబడి  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిముద్దయిపోతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి సిబ్బంది. 
 
 
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది టిటిడి విజిలెన్స్. కాగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించడంతో ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం  ముంద‌స్తుగానే తెలియ‌జేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు