కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1, ఈ నెల 2వ తేదీన విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన గత రోజులను గుర్తుచేసుకుంటూ దర్శక హీరో రిషబ్ శెట్టి ఓ పోస్ట్ చేశారు. 2016లో తన సినిమాను ఒక్క షో ప్రదర్శించడం కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఈరోజు తనకు దక్కుతున్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
2016లో నా చిత్రం సాయంకాలం షో ప్రదర్శించడం కోసం పడిన కష్టం నుంచి 2025లో 5000కు పైగా థియేటర్స్ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించే వరకూ ఇదీ.. దర్శకుడిగా నా జర్నీ. ఈ సినీ ప్రయాణం దేవుడి దయతో పాటు మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆదరణతోనే ఈ విజయం సాధ్యమైంది. నన్ను ఆదరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని తన పోస్ట్లో రాసుకొచ్చారు.
2012లో తుగ్లక్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటిసారి 2016లో రిక్కీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2022లో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారకు జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని అవార్డులు తెచ్చింది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా అదేస్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటోన్న విషయం తెలిసిందే.