నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ఏపీకి ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం నాటికి వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఒకవైపు అల్పపీడనం, మరోవైపు దూసుకొస్తున్న వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందవల్ల బుధవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.