బెజ‌వాడ‌లో హెలికాఫ్టర్ రైడ్... ఈసారి దసరాకు ప్రత్యేకత

మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:36 IST)
ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.  చిన్న చిన్న పనులను రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. రోజుకు పది వేల మందికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు.
 
4 వేలు ఉచిత దర్శనం, మూడు వేలు 100 రూపాయలు, 300 మందికి మూడు వందల రూపాయల టిక్కెట్‌ను స్లాట్ రూపంలో భక్తులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే అని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న వారు మాత్రమే కొండపైకి రావాలని చెప్పారు. ధర్మల్ స్క్రీనింగ్ చెక్ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తామన్నారు. ఘాట్లలో జల్లు స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. హెలికాఫ్టర్ రైడ్ ఈ సారి దసరాకు ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరాన్ని హెలి రైడ్ ద్వారా వీక్షించవచ్చని కలెక్టర్ అన్నారు. 
 
సిపి బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ, దసరాకు 2,500 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. రేపటి నుంచి నాలుగు అంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని సీపీ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు